యూఎన్ఎస్సీలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం: బైడెన్‌ ఆకాంక్ష

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆకాంక్షించారు. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్‌ శ్రింగ్లా తెలిపారు. ఆగస్టులో యుఎన్‌ఎస్‌సి అధ్యక్ష హోదాలో ఉన్న భారత్‌.. ఆఫ్గనిస్తాన్‌ సంక్షోభ సమయంలో సమర్థవంతంగా పనిచేసిందని బైడెన్‌ అభినందించారు. ఈ నేపథ్యంలో భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వతసభ్యత్వం ఉండాలని తాను భావిస్తున్నానని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీతో బైడెన్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే. అనంతరం బైడెన్‌ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం కాంక్షిస్తున్న భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఐక్యరాజ్య సమితి వ్యవస్థాపక దేశాల్లో భారత్‌ ఒకటి. ఏడుసార్లు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా వ్యవహరించింది. భద్రతా మండలిలో మొత్తం 15 దేశాలు ఉంటాయి. వీటిలో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా.. మరో 15 దేశాలను తాత్కాలిక సభ్యదేశాలుగా రెండేళ్ల కాలపరిమితితో ఎన్నుకుంటారు.