పార్టీనే సుప్రీం.. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందాం: పంజాబ్‌ సీఎం చన్నీ

పంజాబ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నవజోత్‌ సింగ్‌ సిద్ధూ పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో అలజడి మొదలైన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మీదే వదిలేసిది అధిష్టానం. ఈ క్రమంలో చన్నీ అత్యవసరంగా కేబినెట్‌ భేటీ నిర్వహించారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీనే సుప్రీం అని.. ఎవరైనా సరే హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చన్నీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సిద్దూతో ఆయన ఫోన్లో మాట్లాడారు. పీసీసీ చీఫ్‌ పదవికి సిద్దూ చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మాట్లాడుతూ.. ”ఏది కావాలని చేయలేదు. ఏదైనా నియామకానికి సంబంధించి ఎవరికైనా అభ్యంతరం ఉంటే.. నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను. నాకు ఎలాంటి ఈగో సమస్యలు లేవు.. పార్టీనే సుప్రీం అని సిద్ధూకి స్పష్టం చేశాను. కూర్చుని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందాం” అన్నారు.

సిద్ధూ రాజీనామా అనంతరం పలువురు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఆయన నివాసానికి వెళ్లి రాజీనామాను వెనక్కి తీసుకోవాల్సిందిగా సిద్ధూని కోరారు. ఇక కాంగ్రెస్‌ అధిష్టానం సిద్ధూ రాజీనామాను అంగీకరించలేదు.. దీనిపై అతడితో చర్చింలేదని సమాచారం.