డెంగ్యూ వ్యాక్సిన్‌పై మరింత ఫోకస్.. వెల్లడించిన ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్

దేశంలో కొన్ని రాష్ట్రాలలో మినహా చాలాచోట్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ పరిణామాలపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ్ స్పందించారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డెంగ్యూ వ్యాక్సిన్ చాలా కీలకమైందని చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో డెంగ్యూ స్ట్రెయిన్లపై అధ్యయనాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

ఇకపై డెంగ్యూ వ్యాక్సిన్‌కు సంబంధించి మరింత విస్తృతంగా ట్రయల్స్ నిర్వహిస్తామని తెలియజేశారు. డెంగ్యూ స్ట్రెయిన్లపై అధ్యయనం చేస్తున్న కంపెనీలు ట్రయల్స్ మాత్రం విదేశాల్లోనే ఎక్కువగా చేస్తున్నాయని డాక్టర్ బలరామ్ తెలిపారు. భవిష్యత్తులో ఈ ట్రయల్స్ భారత్‌లో ఎక్కువగా జరిగేలా కృషి చేస్తున్నట్లు వివరించారు.

కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తింపు గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన పూర్తి డేటాను ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వోకు సమర్పించామని చెప్పారు. ఈ డేటా డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్తలు పరిశీలనలో ఉందని, మరికొన్ని రోజుల్లో కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతులు లభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే ప్రస్తుతానికి బూస్టర్ డోస్ ఆలోచనే లేదని చెప్పిన ఆయన.. దేశ ప్రజలందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ కొన్ని సూచనలు చేశారు. పండుగల సీజన్ కావడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. కరోనా నియమావళిని అనుసరించి పండుగలు చేసుకోవాలని చెప్పారు.