బద్వేలులో త్రిముఖ పోరు !

బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనుంది. వైకాపా, జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా మధ్య ప్రధానంగా పోటీ నడుస్తుండగా… మరికొన్ని చిన్నస్థాయి రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటివరకు (గురువారం నాటికి) మొత్తం 15 నామినేషన్లు రాగా.. ఇందులో వైకాపా 3, భాజపా 1, కాంగ్రెస్‌ 1, గుర్తింపు లేని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 10 మంది ఉన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ జరుగుతున్నా మొదట మందకొడిగా సాగింది. గురువారం నామపత్రాల జోరు కనిపించింది. ఈ ఒక్కరోజే పది మంది నామినేషన్లు వేశారు. వైకాపా అభ్యర్థి దాసరి సుధ రెండో సెట్‌ నామినేషన్‌ సమర్పించారు. నేటి (శుక్రవారం)తో నామినేషన్‌ దాఖలుకు ఆఖరిరోజు కావడంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థులు ముందు జాగ్రత్తగా అదనపు నామినేషన్‌ సెట్లను దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఒకవేళ పరిశీలనలో ఏదైనా కారణంతో ఒక సెట్‌ తిరస్కరణకు గురైనా మరొక దానితో నెట్టుకురావచ్చునని అభ్యర్థులు భావిస్తున్నారు. భాజపా అభ్యర్థిగా సురేష్‌ను గురువారం ప్రకటించడంతో ఆయన హడావుడిగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేయాల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనతో శుక్రవారం మళ్లీ నామినేషన్‌ వేయించేందుకు భాజపా జిల్లా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సమస్యలపై పోరాటం.. 86 రోజుల జైలు జీవితం…

బద్వేలు ఉపఎన్నిక భాజపా అభ్యర్థిగా ఎంపికైన సురేష్‌(38) మొదట్నుంచీ విద్యార్థులు, ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఇందులో భాగంగా ఆయనపై పలు కేసులు నమోదవ్వడంతో 11 సార్లు 86 రోజులపాటు జైలు జీవితం గడిపారు. ఈయన స్వస్థలం రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం పొందలూరు గ్రామం. ఈయన కడప నగరంలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో పీజీ జర్నలిజం అభ్యసించారు. 2002 నుంచి 2018 వరకు అఖిల భారత విద్యార్థి పరిషత్తు (ఏబీవీపీ)లో నగర కార్యదర్శి నుంచి జాతీయ కార్యదర్శి వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. 2018 నుంచి కొంతకాలం కిందట వరకు భారతీయ జనతా యువమోర్చా(బీజేవైఎం) జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఈయనకు ఇంకా వివాహం కాలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీచేసి ఆరో స్థానంలో నిలిచారు. అప్పుడు ఆయనకు 1.049 ఓట్లు (0.77 శాతం) మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం తనపై నాలుగు పోలీసు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సురేష్‌ తన నామినేషన్‌ అఫిడవిట్‌లో వెల్లడించారు. తన జీవనాధారం వ్యవసాయమని, ప్రస్తుతం తన వద్ద కేవలం రూ.50 వేలు తప్ప ఇతర ఆస్తులేమీ లేవని ఆయన అందులో పేర్కొన్నారు.

గతంలో భాజపా ప్రభావం నామమాత్రమే…

భాజపా ఏర్పాటైన అనంతరం బద్వేలు నియోజకవర్గానికి పది సార్లు ఎన్నికలు జరగ్గా.. ఆ పార్టీ మూడుసార్లు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచింది. పోటీ చేసిన ఎన్నికల్లోనూ చాలా తక్కువ ఓట్లతో నామమాత్రపు ప్రభావం చూపింది. 1994 ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ స్థానం భాజపా నుంచి మొట్టమొదటిసారి ఎం.చండ్రాయుడు పోటీ చేసి కేవలం 569 ఓట్లు (0.52 శాతం) సాధించారు. తరువాత 2009 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన వి.నరసింహులు 1,415 ఓట్లు (1.05 శాతం), 2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే జయరాములు పోటీ చేసి 735 ఓట్లు (0.47 శాతం) సాధించి ఏడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఉపఎన్నికలో వీలైనన్ని ఎక్కువ ఓట్లు సాధించి సత్తా చాటడానికి భాజపా నాయకులు సిద్ధమవుతున్నారు.

రూ.కోటికిపైగా ఆస్తులు… రూ.25,98,919 అప్పులు…

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పీఎం కమలమ్మ గురువారం నామపత్రం దాఖలు చేశారు. అంతకుముందు పార్టీ రాష్ట్ర నాయకులు బద్వేలు పట్టణంలో ఉపఎన్నికపై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కమలమ్మ దాఖలు చేసిన నామినేషన్‌ అఫిడవిట్‌లో తన ఆదాయ, ఇతర వివరాలు వెల్లడించారు. కమలమ్మ, ఆమె భర్త ఇద్దరూ విశ్రాంత ప్రిన్సిపల్స్‌ కావడంతో ప్రస్తుతం సర్వీసు పింఛను ఆధారంగా జీవిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంతో తన ఆదాయం రూ. 8,70,120 అని అందులో పేర్కొన్నారు. తన వద్ద స్కార్పియో కారు, 600 గ్రాముల బంగారం, ఇతర రూపాల్లో ఉన్న నగదు కలిపి రూ.47,50,000 చరాస్తులు, మరో రూ.63 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఆమెకు బ్యాంకులు, ఇతర రూపాల్లో రూ.25,98,919 అప్పులు ఉన్నాయి.