శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్.వి.రమణ దర్శించుకున్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేద పండితులు శేషవస్త్రంతో సీజేఐని సత్కరించి.. స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాలు అందజేశారు.

ఇవాళ ఉదయం జరిగిన చక్రస్నాన ఘట్టంలో పాల్గొన్నసీజేఐ ఎన్వీ రమణ వీఐపీ విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సీజేఐతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ జె.కె.మహేశ్వరి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో చివ‌రి రోజైన శుక్రవారం.. ఉద‌యం 8 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని ఐనా మ‌హ‌ల్ వ‌ద్ద స్నపన తిరుమంజ‌నం, చ‌క్రస్నానం నిర్వహించారు. రాత్రి 7 గంట‌లకు ఆల‌యంలో బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు ధ్వజావ‌రోహ‌ణం జ‌రుగ‌నుంది.