ఏపీలో నేటి నుంచి రేషన్‌ దుకాణాలు బంద్‌..

ఏపీలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలు మూసివేస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది. సమస్యలు పరిష్కరించే వరకు రాష్ట్రంలో రేషన్ దిగుమతి, పంపిణీ నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యూలర్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డీలర్ల నుంచి ఐసీడీఎస్‌కు మళ్లించిన కందిపప్పునకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డీలర్లు కోరారు.

2020 మార్చి 29 నుంచి నేటివరకు ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచి డీలర్లకు రావాల్సిన కమీషన్ బకాయిలు చెల్లించాలన్నారు. గోనె సంచులను ప్రభుత్వానికి తిరిగిస్తే రూ.20 చొప్పున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు చెల్లింపు చేయమని చెప్పడం సరైంది కాదని డీలర్లు ఆక్షేపించారు. గోనె సంచులు తిరిగి ఇవ్వకుంటే ఎలాట్‌మెంట్‌ కట్ చేసి కేసులు పెడతామని హెచ్చరించడం తగదన్నారు. గోనె సంచులు ప్రభుత్వం తీసుకునేలా ఇచ్చిన జీవో 10ని పక్క రాష్ట్రం తెలంగాణలో అమలు చేస్తున్నారని డీలర్లు గుర్తు చేశారు. ఏపీలోనూ జీవో 10ని యథాతథంగా అమలు చేయాలని రేషన్‌ డీలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.