రైతు ఉద్యమానికి 11 నెలలు.. దేశవ్యాప్త ఆందోళనకు సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు..

చారిత్రాత్మక రైతు ఉద్యమం ప్రారంభమై మంగళవారం నాటికి 11 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్త ఆందోళనలకు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపునిచ్చింది. మండల, జిల్లా కేంద్రాల్లో మంగళవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆందోళనలు జరుగుతాయి. కేంద్ర హోం సహాయ మంత్రి అజరు మిశ్రా టెనీని అరెస్టు చేసి, కేంద్ర మంత్రి మండలి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ, జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, రాష్ట్రపతిలకు వినతి పత్రం అందజేస్తారు.

ఎన్‌ఆర్‌ఐ ధర్శన్‌సింగ్‌ను అడ్డుకున్న మోడీ సర్కారు

రైతుల ఉద్యమానికి మద్దతుదారు, ఎన్‌ఆర్‌ఐ దర్శన్‌ సింగ్‌ ధాలివాల్‌ చికాగో నుంచి దేశంలో ప్రవేశించడాన్ని మోడీ ప్రభుత్వం అడ్డుకుందని ఎస్‌కెఎం విమర్శించింది. ఆయన దేశంలోకి రావడానికి అనుమతించకుండా తిరిగి పంపించేశారు. మోడీ ప్రభుత్వం అప్రజాస్వామిక, నిరంకుశ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, దానిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్‌కెఎం పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని, హోం మంత్రి దిష్టిబొమ్మలను దహనం చేసినందుకు రైతులపై పెట్టిన కేసులన్నింటినీ వెంటనే ఉపసంహరించు కోవాలని ఎస్‌కెఎం డిమాండ్‌ చేసింది.

కొనసాగుతున్న అస్థి కలశయాత్రలు
దేశంలోని వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లో షహీద్‌ కిసాన్‌ అస్థి కలశ యాత్రలు జరుగుతున్నాయి. తమిళనాడు యాత్ర మూడోరోజు కొనసాగుతోంది. హర్యానాలోని పానిపట్‌ జిల్లా గుండా యాత్ర సాగింది. పంజాబ్‌లోని ఒక యాత్ర మాన్సా, భటిండా, ఫిరోజ్‌పూర్‌లకు చేరుకోగా, మరొక యాత్ర ఫగ్వారా, కిరాత్‌పూర్‌ సాహిబ్‌ మీదుగా ప్రయాణించింది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా గుండా యాత్ర సాగింది.