రెండో రోజు మహాపాదయాత్ర.. వైసిపి మినహా అన్ని పార్టీల మద్దతు

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతుల మహాపాదయాత్ర సోమవారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఉదయానికే పరిసర గ్రామాల నుండి భారీ సంఖ్యలో రైతులు, మహిళలు తుళ్లూరుకు తరలివచ్చారు. వేలాది మంది ఆకుపచ్చ జెండాలు పట్టుకుని తరలిరావడంతో గ్రామం హరితవర్ణానుంతరించుకుంది. ఉదయం 9.05 గంటలకు రైతులు దేవాలయంలో పూజలు చేశారు. సర్వమత ప్రార్ధనల అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న నినాదాలు మారుమ్రోగాయి. ఈ యాత్రకు వైసిపి మినహా మిగిలిన అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ యాత్రకు సంఘీభావం తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు, రాజధాని నాయకులు రవి, భాగ్యరాజు, అజరు సంఘీభావం ప్రకటించి, యాత్రలో కొద్దిసేపు నడిచారు టిడిపికి చెందిన మాజీ మంత్రులు దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు తదితరులు కూడా పాల్గొన్నారు. తొలిరోజు 14.5 కి.మీలు నడిచిన అనంతరం తాడికొండలో యాత్రకు విరామం ఇచ్చారు.