Farmer protest : 29 నుంచి పార్లమెంట్‌ మార్చ్‌

 దేశంలో చారిత్రాత్మక రైతు ఉద్యమం ఈ నెల 26తో ఏడాది పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆ రోజున భారీ సభలు నిర్వహణకు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నిర్ణయించింది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భారీ సమీకరణ చేయాలని నిర్ణయించింది. అలాగే  ప్రతి రోజు 500 మంది రైతులు పార్లమెంట్‌కు ట్రాక్టర్లపై వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సింఘూ సరిహద్దు వద్ద ఎస్‌కెఎం సమావేశం జరిగింది. ఈ నెల 26న పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌ల నుంచి ఢిల్లీ సరిహద్దులకు భారీ జనసమీకరణ జరగనుందని, అక్కడ భారీ సమావేశాలు నిర్వహించనున్నామని ఎస్‌కెఎం పేర్కొంది. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువకులు, విద్యార్థులు నవంబర్‌ 26న దేశంలోని అన్ని రాష్ట్ర రాజధానుల్లో భారీ ఉమ్మడి సభలు నిర్వహించాలని పిలుపు ఇచ్చినట్లు తెలిపింది. ఈ నెల 29 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరగున్నాయని, ఆ రోజు నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ముగిసే వరకు 500 మంది ఎంపిక చేసిన రైతులు ప్రతి రోజూ శాంతియుతంగా ట్రాక్టర్‌ ట్రాలీల్లో పార్లమెంట్‌కు వెళ్లనున్నట్లు పేర్కొంది. లఖింపూర్‌ ఖేరీ ఊచకోత కేసులో నిజానిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, అయినప్పటికీ మోడీ, యోగి ప్రభుత్వాలు సిగ్గులేకుండా మంత్రిని, ఆయన కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్‌కెఎం విమర్శించింది. కేంద్ర మంత్రి అజయ్  మిశ్రాని పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలని, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని ఎస్‌కెఎం పునరుద్ఘాటించింది. నార్నౌండ్‌లో నల్ల జెండాలతో ఆందోళన చేసిన రైతులపై బనాయించిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవడానికి, బిజెపి ఎంపి రామ్‌ చందర్‌ జంగ్రాపై కేసు నమోదు చేయడానికి హర్యానా ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో హన్సి జిల్లా ఎస్‌పి కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన రెండో రోజు కూడా కొనసాగింది. ఈ కేసులో న్యాయం చేయాలంటూ వేలాది మంది రైతులు, రైతు నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. జంగ్రాపై కేసు నమోదు చేసేందుకు అధికార యంత్రాంగం నిరాకరించడంతో రైతు నేతలు, అధికార యంత్రాంగం మధ్య చర్చలు విఫలమయ్యాయి. కాగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రైతు కుల్దీప్‌ సింగ్‌ రాణా ప్రాణాల కోసం పోరాడుతూనే ఉన్నాడు.