తొలి బొమ్మల తయారీ పరిశ్రమ

భారతదేశంలోనే తొలి బొమ్మల తయారీ పరిశ్రమను కర్ణాటకలోని కొప్పాలలో అభివృద్ధి చేయబోతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప వెల్లడించారు. తద్వారా 40,000 మందికి ఉపాధి కల్పించడంతోపాటు, రాష్ట్రానికి రూ.5000 కోట్ల పెట్టుబడులు రాబట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. పిల్లలు ఆడుకునే బొమ్మలను స్థానికంగానే తయారు చేయాలని మోదీ పిలుపు నిచ్చిన నేపథ్యంలో యడ్డీ ఈ మేరకు స్పందించారు.

”ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా దేశంలోనే తొలి బొమ్మల తయారీ కేంద్రాన్ని కొప్పాలలో అభివృద్ధి చేస్తాం. 400 ఎకరాల్లో అత్యుత్తమ సౌకర్యాలతో దీనిని ఏర్పాటు చేస్తాం. వచ్చే 5 ఏళ్లలో 40,000 మందికి ఉపాధి కల్పిస్తాం” అని యడియూరప్ప ట్వీట్‌ చేశారు.

మన్‌కీబాత్‌ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బొమ్మల తయారీలో భారత్‌ ప్రపంచ కేంద్రంగా ఉండాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చిన్నారులు ఆడుకునే బొమ్మలను స్థానికంగానే తయారు చేయాలని ప్రధాని అన్నారు. దీని కోసం యువత ముందుకు రావాలన్నారు. ప్రపంచ ఆట బొమ్మల తయారీలో భారత్‌ వాటా చాలా తక్కువగా ఉందని.. ఇది ఏమాత్రం సరి కాదని అభిప్రాయపడ్డారు. ఆట బొమ్మలు వినోదాన్ని పంచడమే కాకుండా.. పిల్లల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తాయన్నారు.