తిరుపతి లో జల విలయానికి కారణం చెరువులను చెరబట్టి కబ్జా చేయడమే

• పేరూరు, తుమ్మలగుంట, అవిలాల చెరువుల్లో పక్కా భవనాలు… స్టేడియమ్ పార్కులు…

• చెరువుల్లోనే రియల్ ఎస్టేట్ లే అవుట్లు… చెరువు మధ్య నుంచి రోడ్డు నిర్మాణం

• పేరూరు, తుమ్మలగుంట, అవిలాల చెరువుల దుస్థితిని పరిశీలించిన శ్రీ నాదెండ్ల మనోహర్

అధికార పార్టీ నాయకుల భూ దాహమే తిరుపతి ప్రజల వరద కష్టాలకు కారణమని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇంత పెద్ద పెద్ద చెరువుల్ని విచ్చలవిడిగా ఆక్రమించేసిన ఘనత వైసీపీ నాయకులకే చెల్లిందన్నారు. తిరుపతి నగరాన్ని వరదలు చుట్టుముట్టి జనజీవనం అతలాకుతలమైన క్రమంలో తెరపైకి వచ్చిన ప్రధాన అంశం చెరువుల ఆక్రమణలు. అధికార పార్టీ నాయకులు తమ స్వార్ధం కోసం వందల ఎకరాల విస్తీర్ణంలోని గొలుసుకట్టులో ఉన్న చెరువుల్ని కబ్జా చేయడమే కారణం అనే విషయం చర్చకు వచ్చింది. వరద ముంపు ప్రాంతాల పర్యటనలో శ్రీ నాదెండ్ల మనోహర్ దృష్టికి ఈ ఆక్రమణల విషయాన్ని ప్రజలు తీసుకువెళ్లారు. గురువారం మధ్యాహ్నం శ్రీ మనోహర్ పేరూరు, తుమ్మలగుంట, అవిలాల చెరువులను, ఆ పరిసరాలు పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి చెరువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేరూరు చెరువు క్యాచ్మెంట్ ఏరియాని అధికార పార్టీ కనుసనల్లో రియల్ ఎస్టేట్ మాఫియా ఆక్రమించేయడాన్ని గుర్తించారు. అక్రమ లే అవుట్లు వేసి ఉండడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తిరుపతిని శాసిస్తున్న అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడి ఆధ్వర్యంలో ఈ దందా మొత్తం సాగుతున్న విషయాన్ని స్థానిక జనసేన శ్రేణులు శ్రీ నాదెండ్ల మనోహర్ కి వివరించారు. చెరువు ఆక్రమణతో ప్రధాన రహదారిపైకి వచ్చిన వరద నీటికి అడ్డుకట్ట వేసేందుకు కొండ రాళ్లు వేయడాన్ని చూసి విస్తుపోయారు. పేరూరు చెరువు నుంచి ప్రవాహం సహజసిద్ధంగా తుమ్మలగుంట చెరువుకు, అక్కడి నుంచి అవిలాల చెరువుకు వెళ్లాల్సి ఉంది. అయితే తుమ్మలగుంట చెరువు మధ్య నుంచి అధికార పార్టీ నాయకులు అక్రమంగా రహదారి నిర్మాణం చేపట్టడంతో పాటు 60 ఎకరాలు ఆక్రమించి స్టేడియం నిర్మాణం చేపట్టారు. పేరూరు చెరువు నుంచి వచ్చే ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. ఈ విషయాన్ని స్థానికులు శ్రీ నాదెండ్ల మనోహర్ కి తెలియపర్చారు. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే సదరు నేతకు చెందిన గూండాలు కొడతారని భయాందోళనలు వ్యక్తం చేశారు. చివరిగా పూర్తిగా మాయం అయిన అవిలాల చెరువులో నిర్మించడానికి సిద్ధం చేసిన పార్కును సందర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీ పెదపూడి విజయ్ కుమార్, శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, శ్రీ కిరణ్ రాయల్, శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీమతి ఆకెపాటి సుభాషిణి, శ్రీమతి ఆరణి కవిత, శ్రీ పగడాల మురళీ, శ్రీ మహేష్, శ్రీ రాజారెడ్డి, శ్రీ దేవర మనోహర్, శ్రీ విశ్వనాథ్, శ్రీ కె.సురేష్, శ్రీ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.