పరిపాలన చేతకాకపోతే తప్పుకోండి: నేరేళ్ళ సురేష్

  • కుక్కల్ని అరికట్టలేని స్థితిలో అధికారులు, పాలకులు ఉండటం సిగ్గుచేటు
  • నగరపాలక సంస్థ కమీషనర్, మేయర్ లపై ధ్వజమెత్తిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, నగర అధ్యక్షులు నేరేళ్ళ సురేష్
  • కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడిని పరామర్శించిన జనసేన నేతలు

గుంటూరు: సాక్ష్యాత్తూ నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు ఇంటికి కూతవేటు దూరంలో కుక్కలు స్వైరవిహారం చేస్తూ పిల్లల్ని , పాదచారుల్ని వెంటపడి తీవ్రంగా గాయపరుస్తుంటే నగరంలో కుక్కల బెడద ఎంతటి ప్రమాదకరమైన స్థితిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ ధ్వజమెత్తారు. కుక్కల బెడదపై నగరపాలక సంస్థ అధికారులకు , పాలకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా దున్నపోతుపై వానపడ్డ చందాన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పరిపాలన చేతకాకపోతే నగర మేయర్ , కమీషనర్ తక్షణమే తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం సంపత్ నగర్ లో కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ కార్తికేయను బోనబోయిన శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కుక్కలు తిరగాడుతూ ప్రజలను గాయపరుస్తుంటే పాలకులకు , అధికారులకు చీమకుట్టినట్లుగా కూడా లేకపోవటం సిగ్గుచేటన్నారు. ప్రజలు ఇళ్ళల్లోంచి బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని బోనబోయిన అన్నారు. నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ పిల్లల్ని స్కూల్ కి పంపాలంటే భయంగా ఉందని , పెద్దలు పనులు మానుకొని పిల్లలని కనిపెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇంటి నుంచి బయటికి పోవాలి అంటే ఒక కర్రను వెంటబెట్టుకొని పోవాల్సి వస్తుందన్నారు. నగర మేయర్ , కమీషనర్ , కార్పొరేటర్లు కుక్కల్ని తమ ఇల్లల్లో కట్టేసుకోవాలన్నారు. చివరికి కుక్కల్ని కూడా అరికట్టలేని హీనస్థితిలో నగరపాలక సంస్థ ఉండటం హేయమన్నారు. ఇప్పటికైనా కుక్కల బెడదపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, లేని పక్షంలో జనసేన పార్టీ తరుపున పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని నేరేళ్ళ సురేష్, బోనబోయిన హెచ్చరించారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి , రెల్లి నేత సోమి ఉదయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు కొలసాని బాలకృష్ణ, సయ్యద్ షర్ఫుద్దీన్, సానం రమేష్, గడ్డం రోశయ్య, కోలా అంజి, బాలు, సురేంద్ర, రవి , కార్తిక్ , సుబ్బారావు, నండూరి స్వామి తదితరులు పాల్గొన్నారు.