సీఎం జగన్ మరో హామీ

విద్యుత్ ఎప్పుడూ ఉచితమే.. ప్రస్తుత సంస్కరణలతో రైతులపై ఒక్క పైసా భారం పడబోదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.

మంత్రిమండలి సమావేశంలో సీఎం మంత్రులతో మాట్లాడుతూ… మీటర్ల ఖర్చు డిస్కమ్​లది, ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రస్తుత సంస్కరణలతో రైతులపై ఒక్క పైసా భారం పడబోదని అన్నారు. వచ్చే 30-35 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ పథకానికి డోకా లేకుండా చేస్తున్నామని వెల్లడించారు.

ఉచిత విద్యుత్​పై పేటెంట్ వైఎస్సార్​కే ఉంది. అందుకే ఆయన పేరుతోనే ఈ పథకం అమలు చేస్తున్నాం. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని నీరుగార్చాయి. పగటిపూట 9 గంటల విద్యుత్తు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఉచిత విద్యుత్తు పథకానికి ఢోకా లేకుండా యూనిట్ రూ.2.50కే వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉచిత విద్యుత్తుకు ఏడాదికి ఒక్కో రైతుకు రూ. 49,600 చొప్పున మొత్తం రూ.8000కోట్లు ఖర్చవుతుంది అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

తెలంగాణకు ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ మంత్రి పేర్నినానికి సీఎం సూచించారు.