విశాఖ మేయర్ ఎన్నికల వేళ రాజీనామాల షాక్…?

విశాఖలో పద్నాలుగేళ్ళ తరువాత జీవీఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికి ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ ఎన్నికలు ఇపుడు జరగడాన్ని అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఎన్నికలు జరగాలి, కొత్త పాలక వర్గాలు కొలువు తీరాలి. విశాఖ సిటీ అభివృద్ధి చెందాలి అన్నదే అందరి ఆకాంక్షగా ఉంది.

ఇదిలా ఉంటే విశాఖ ఎన్నికలు ఇలా ప్రకటించారో లేదో అలా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చిచ్చు రాజుకుంది. దాంతో విశాఖ ఎన్నికలకు ఉక్కు సెగ బాగా తగులుతోంది. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన స్పీకర్ ఫార్మెట్ లో తన రాజీనామాను తమ్మినేని సీతారామ్ కి పంపించారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గట్టిగా చెప్పడంతో గంటా మళ్ళీ సీన్ లోకి వచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి తాను రాజీనామా చేశానని ఆయన చెప్పుకొచ్చారు. తనతో పాటు టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా రాజీనామా చేస్తేనే తప్ప విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదని ఆయన కుండబద్దలు కొడుతున్నారు.

విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేయాలంటూ ఆయన పట్టుపడుతున్నారు. దీంతో అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష టీడీపీ కూడా ఒక్కసారిగా ఇరకాటంలో పడిపోయాయి. జీవీఎంసీ ఎన్నికల వేళ ఈ శీల పరీక్ష ఏంటి అని రెండు పార్టీలలో అంతర్మధనం సాగుతోంది. మరో వైపు విశాఖ ఎన్నికల్లో ఉనికి బలంగా చాటుకుందామనుకుంటున్న బీజేపీ జనసేనలకు కూడా గంటా డిమాండ్ అసలు మింగుడుపడడంలేదు. మొత్తం మీద చూస్తూంటే విశాఖ ఎన్నికల మీద ఉక్కు సెగ బాగానే పడుతోంది. మరి రాజీనామాల డిమాండ్ కి ఎవరు తలొగ్గుతారు అన్నదే చూడాలి.