టాలీవుడ్లో విషాదం…సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున ఆయన గుంటూరులోని తన నివాసంలో గుండెపోటుకు గురయ్యారు. బాత్‌రూమ్‌లో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలిండానికి ప్రయత్నించినప్పటికీ.. ఫలితం రాలేదు. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినస్పటి నుంచి ఆయన గుంటూరులో నివసిస్తున్నారు. సినిమా షూటింగ్స్ లేకపోవడం వల్ల ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ తెల్లవారుజామున ఆయన గుండెపోటుకు గురయ్యారు. తుదిశ్వాస విడిచారు.

జయప్రకాష్ రెడ్డి సొంత ఊరు కడప జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల. సినిమాల్లోకి రాకముందు ఎస్సైగా పనిచేసిన జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మపుత్రుడుతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. పలు నాటకాల్లోనూ ఆయన నటించారు. ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, ఛత్రపతి, బిందాస్, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, బాద్షా, రేసుగుర్రం, మనం, రెడీ, పటాస్, టెంపర్‌, సరైనోడు, ఖైదీ నంబర్ 150, జై సింహా, రాజా ది గ్రేట్‌ వంటి హిట్ చిత్రాల్లో నటించిన జయప్రకాష్ రెడ్డి.. చివరిసారిగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరులో కనిపించారు. కమెడియన్‌గా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు జయప్రకాష్ రెడ్డి. ముఖ్యంగా ఆయన రాయలసీమ మాండలీకానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి.