సరిహద్దులో భారత వాయుసేన మోహరింపు పెంపు

చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత వాయుసేన మోహరింపు కార్యకలాపాలు మరింతగా పెరిగాయి. పాంగోంగ్ సరస్సు పరిధిలో కీలకమైన ఎత్తైన ప్రాంతాల్లో భారత ఆర్మీ సైనికులున్నారు. కాగా ఎల్‌ఏసీని భారత్ అతిక్రమించిందని చైనా పేర్కొంది. దీనిపై అభ్యంతరం తెలిపేందుకు వచ్చిన తమ సైనికులను బెదిరిస్తూ భారత సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారని ఆరోపించింది. భారత్ వెనక్కి తగ్గకపోతే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మరోవైపు మంగళవారం రాత్రి నుంచి పాంగోంగ్ సరస్సు సమీపంలోని ఫింగర్ 3 ఎత్తైన ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలను చైనా పెంచింది.

ఈ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భారత్ కూడా ధీటుగా బలగాలను పెంచింది. ఈ నేపథ్యంలో భారత వాయుసేన కూడా మరింత అప్రమత్తమైంది. సుఖోయ్, మిగ్ యుద్ధ విమానాలతోపాటు సైనిక రవాణా విమానాల మోహరింపును పెంచింది. చైనా నుంచి ఎలాంటి విపత్తు చర్యలు ఎదురైనా తిప్పికొట్టేందుకు పూర్తి సిద్దంగా ఉన్నది. మరోవైపు రష్యా పర్యటనలో ఉన్న కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దులో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గవచ్చని భావిస్తున్నారు.