ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్‌ కొనసాగుతాయి

బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ వాలంటీర్‌కి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ మూడోదశ ట్రయల్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై దేశీయ ఫార్మా దిగ్గజం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా స్పందించింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ని భారత్‌లో నిలిపివేయలేదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది. భారత్‌లో పరీక్షలు కొనసాగుతున్నాయనీ, ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదని సీరం వెల్లడించింది. ప్రస్తుతానికి బ్రిటన్‌లో ట్రయల్స్‌ని నిలిపివేసినా.. త్వరలోనే తిరిగి ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నట్టు తెలిపింది.

బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ మూడో దశ ట్రయల్స్‌ని ప్రస్తుతానికి నిలిపి వేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా అధికారికంగా ప్రకటన చేసింది. ప్రయోగ ప్రామాణిక ప్రక్రియ, వ్యాక్సిన్ భద్రతపై పూర్తి స్థాయి సమీక్ష కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రాజెనెకా తెలిపింది. దీంతో బ్రిటన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో జరుగుతున్న ఈ వ్యాక్సిన్ ప్రయోగం నిలిచిపోయింది. కాగా కరోనా వ్యాక్సిన్ రేసులో ఆక్స్‌ఫర్డ్ టీకా ముందువరుసలో ఉంది. ఇక ఈ వ్యాక్సిన్‌కి సంబంధించి భారత్‌లో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది.