నోబెల్ బహుమతికి నామినేషన్ లో ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం 2021కు నామినేట్ చేశారు. ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో మధ్యవర్తిత్వం వహించినందుకుగానూ ట్రంప్‌ను నామినేట్ చేశారు. నార్వే ఎంపీ క్రిస్టియన్ టైబ్రింగ్-గ్జెడ్డే ట్రంప్‌ను నామినేట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వివాదాలను పరిష్కరించడంలో ట్రంప్ ఎనలేని కృషి చేస్తున్నారని 57 ఏళ్ల సదరు ఎంపీ ఫాక్స్ న్యూస్‌తో పేర్కొన్నారు. ”శాంతి బహుమతి అందుకునేందుకు ట్రంప్‌కే ఎక్కువ యోగ్యత ఉందని భావిస్తున్నాను. ఆయా దేశాల మధ్య శాంతిని నెలకొల్పే విషయంలో ఇతర నామినీల కంటే ట్రంప్ ఎంతో కృషి చేస్తున్నారు..” అని గ్జెడ్డే తన నామినేషన్ లేఖలో పేర్కొన్నట్టు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. మిగతా మధ్య ప్రాచ్య దేశాలు కూడా యూఏఈ బాటలో నడుస్తాయన్న అంచనాలు ఉన్నాయనీ.. అదే జరిగితే ఇజ్రాయేల్-యూఏఈ ఒప్పందం ఓ గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కంటే ట్రంప్‌ చాలా మెరుగంటూ గ్జెడ్డే పేర్కొన్నారు. ”ఇటీవల సంవత్సరాల్లో నోబెల్ శాంతి బహుబతిని అందుకున్న వాళ్ల కంటే ట్రంప్ చాలా ఎక్కువ కృషి చేశారు. బరాక్ ఒబామా ఏమీ చేయకుండానే నోబెల్ బహుమతిని అందుకున్నారు…” అని ఆయన చెప్పుకొచ్చారు. కాగా శాంతి కోసం తాను చేసిన కృషికి నోబెల్ బహుమతి వస్తుందని ఆశిస్తున్నట్టు గతేడాది ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. బరాక్ ఒబామాకి గతంలో నోబెల్ బహుమతి ఇవ్వడాన్ని కూడా ఆయన అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్‌ను నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేయడం విశేషం.