‘రైడర్’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్
మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు యువరాజా నిఖిల్ కుమార్ హీరోగా నటిస్తున్న నాలుగో చిత్రానికి ‘రైడర్’ అనే టైటిల్ ఖరారుచేయగా ఈ సినిమాకు సంబందించిన టైటిల్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను సెప్టెంబర్ 11న శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ పోస్టర్లో నిఖిల్ కుమార్ పరుగెత్తుతూ కనిపిస్తున్నారు. ఆయన యాక్షన్ మోడ్‌లో ఉన్నారనీ, గూండాలను చితగ్గొడుతున్నారనీ వాళ్లు చెల్లాచెదురుగా కిందపడిపోవడం చూపుతుంది. ‘రైడర్’ అనే టైటిల్‌కు తగ్గట్టు ఫస్ట్ లుక్‌లో హీరో కనిపిస్తున్నారు.
ఫస్ట్ లుక్‌తో పాటు విడుదల చేసిన మోషన్ పోస్టర్ మరింత వివరంగా హీరో చేసిన యాక్షన్ ఎపిసోడ్‌ను తెలియజేస్తోంది. హీరో బాస్కెట్ బాల్‌ను విసిరేయడం, ఆ తర్వాత రన్నింగ్ చేస్తూ గూడ్స్ కంటైనర్ల మధ్య తనపైకి వచ్చిన గూండాలను ఉతికి ఆరేసినట్లు చూపించడం కనిపిస్తోంది. ఈ సినిమాతో నిఖిల్ కుమార్ ఒక ఫెరోషియస్ యాక్షన్ హీరోగా మన ముందుకు రానున్నారనే అభిప్రాయాన్ని ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కలిగిస్తున్నాయి.
‘రైడర్’లో నిఖిల్ కుమార్ సరసన నాయికగా కశ్మీరా పరదేశి నటిస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాను లహరి ఫిలిమ్స్ బ్యానర్‌పై చంద్రు మనోహరన్ నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకే సమయంలో ఈ మూవీ నిర్మితమవుతోంది.