ఏపి లో ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్‌: డీజీపీ గౌతం సవాంగ్

అంతర్వేది రథం దగ్ధం ఘటనతో ఏపి పోలీసు శాఖ అప్రమత్తమైoది. దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులను డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశించారు. ప్రార్థన మందిరాల వద్ద నిఘా కొనసాగిoచాలని సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు. ఆలయాలు, ప్రార్థన మందిరాలతోపాటు పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించేలా నిర్వాహకులు విద్యుత్తు దీపాలు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలని, అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని డీజీపీ తెలిపారు.

ఆలయాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉన్నoదున భద్రత చర్యలను ఎప్పటికిప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. మతసామరస్యానికి ప్రతీకైన రాష్ట్రంలో కొందరు ఆకతాయిలు ఉదేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చుపెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని గౌతం సవాంగ్ పేర్కొన్నారు. అలాంటి చర్యలను పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.