పోలవరం పెండింగ్ నిధుల విడుదల.. నిర్మలా సీతారామన్ హామీ

కోవిడ్-19 ప్రబావం ఉన్నప్పటికీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేంద్రం నుంచి నిధుల కోసం చూడకుండా ప్రభుత్వం సొంతంగాఖర్చు చేస్తోందన్నారు. కేంద్రం నుంచి రూ. 3,805 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, దీనికి సంబంధించి కాగ్ ఆడిట్ కూడా పూర్తయిందన్నారు. పోలవరంకు సంబంధించి బకాయిలు విడుదల చేయాలని సీఎం జగన్‌ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని పేర్కొన్నారు. కేంద్రం నిధులు విడుదల చేస్తే 2021 చివరి నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తికి సభలోనే ఉన్న ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ స్పందిస్తూ పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును ధృవీకరిస్తూ కంట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తమకు సమర్పించినట్లు తెలిపారు. రూ.3,805 కోట్ల రూపాయల బకాయిల విడుదలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జల శక్తి మంత్రితో చర్చలు జరుపుతున్నట్లు ఆమె సభకు తెలిపారు. త్వరలోనే ఈ మొత్తం బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆమె హామీ ఇచ్చారు.