తెలంగాణ పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు

హైదరాబాద్ లో నిర్వహించిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా.. అదే విధంగా జన సామాన్యానికి అవాంతరాలు లేకుండా చేయడంలో, ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో పోలీసులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ గారు, సిటీ జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) ఎ.వి.రంగనాథ్ గారు, వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ తోపాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులకు, పోలీసు సిబ్బందికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమం సాఫీగా సాగడంలో ఎంతో శ్రమించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసేలా లైవ్ కవరేజీలు, వార్తా కథనాలు అందించిన పాత్రికేయులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ వేడుకలో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొని క్రమశిక్షణతో మెలిగిన అభిమానులకు అభినందనలు. అభిమానులు ఇదే క్రమశిక్షణను, స్ఫూర్తిని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ కోరారు.