ఎప్పుడో కట్టుకున్న ఇళ్ల‌కు ఇప్పుడు కోట్లు క‌ట్టాలా?

* ద‌శాబ్దాల నాటి ఇళ్లకు ప్ర‌భుత్వ నోటీసులు
* గ‌గ్గోలు పెడుతున్న ప‌ట్ట‌ణ వాసులు
* ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీలింగ్ భూముల పేరిట తాజా గంద‌ర‌గోళం

ఎప్పుడో 60 ఏళ్ల క్రితం క‌ట్టుకున్న ఇంటిలో మీరు నిశ్చింత‌గా ఉన్నారు…
ఇప్పుడు ప్ర‌భుత్వం నుంచి ఓ నోటీసు వ‌చ్చింది…
ఆ ఇంటి నిమిత్తం కోట్లాది రూపాయ‌లు క‌ట్టాల‌నేది దాని సారాంశం…
గుండె గుభేలు మ‌న‌దూ?
అదే జ‌రుగుతోంది ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో!

ఇలా కొన్ని వేల మందికి నోటీసులు అందుతుండ‌డంతో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. అంతులేని ఆవేద‌న‌కు గుర‌వుతున్నారు.
ఎక్క‌డో ఒక చోట కాదు… గుంటూరు, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి న‌గ‌రాల్లో వేలాది మంది దిగ్బ్రాంతికి గుర‌వుతున్నారు. ఆక్రోశిస్తూ అల‌మ‌టిస్తున్నారు.
ఇంత‌కీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇంత అక‌స్మాత్తుగా తీసుకున్న ఈ తాజా నిర్ణయానికి కార‌ణ‌మేమిటీ?
తీవ్ర‌మైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన ప్ర‌భుత్వం ఎక్క‌డ వీలుంటే అక్క‌డి నుండి, ఎవ‌రి ద‌గ్గ‌ర నుంచి వీలుంటే వారి ద‌గ్గ‌ర నుంచి ఎలాగోలా కోట్లాది రూపాయ‌లు పిండుకోవాల‌ని చూడ్డ‌మేన‌ని ప్ర‌తిప‌క్షాలు, ప‌రిశీల‌కులు ఆరోపిస్తున్నారు.
మ‌రి ప్ర‌భుత్వం చూపిస్తున్న కార‌ణం ఏంటో తెలుసా? అర్భ‌న్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్! ఎప్పుడో 1976 నాటి ఈ ప‌ట్ట‌ణ భూ ప‌రిమితి చ‌ట్టాన్నిసాకుగా చూపిస్తూ ఇప్ప‌టి ధ‌ర‌ల ప్ర‌కారం త‌క్ష‌ణం క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ చేసుకోవాలంటూ అందుతున్న ప్ర‌భుత్వ నోటీసులతో వేలాది మంది అయోమ‌యంలో ప‌డిపోయారు. ఇంకా అనేక న‌గ‌రాల‌లోని వారికి కూడా ఈ నోటీసులు జారీ చేసే ప‌నిలో అధికారులు ఉన్నార‌నే సూచ‌న‌లు రాష్ట్ర వ్యాప్తంగా గుబులు పుట్టిస్తున్నాయి.
విచిత్ర‌మేమిటంటే కొన్ని చోట్ల ఈ చ‌ట్టానికి ముందు క‌ట్టుకున్న ఇళ్ల య‌జ‌మానుల‌కు కూడా ఈ నోటీసులు అంద‌డం మ‌రింత గంద‌ర‌గోళాన్ని సృష్టిస్తోంది. అలాగే ఇప్ప‌టికే క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ కోసం ల‌క్ష‌లాది రూపాయ‌లు క‌ట్టిన వారికి కూడా మ‌ళ్లీ నోటీసులు అంద‌డం మ‌రో మింగుడు ప‌డ‌ని అంశంగా మారింది.
ఇది జ‌గ‌న్ ప్ర‌భుత్వ అనాలోచిత నిర్ణ‌యాల‌కి, ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బులు పిండుకోవాల‌నే కుయ‌త్నాల‌కు తాజా నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌తిప‌క్షాల‌తో పాటు అనేకులు విమ‌ర్శిస్తున్నారు.

ఇవిగివిగో ఉదాహ‌ర‌ణ‌లు…
రెగ్యులైజేషన్‌… సామాన్యులకు అర్థ‌మ‌య్యేలా చెప్పాలంటే క్ర‌మ‌బద్ధీక‌ర‌ణ‌. ఇప్పుడీ ప‌దం ఆంధ్ర‌ప్రదేశ్‌లో పేద‌ల నుంచి మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల వర‌కు అనేక‌మంది గుండెల్లో బాంబు చ‌ప్పుడులా వినిపిస్తోంది.
మొన్నటికి మొన్న ఎప్పుడో 1983 నుంచి ఆయా ప్ర‌భుత్వాలు పేద‌ల‌కు పంపిణీ చేసిన ఇళ్లను….వాటిపై తీసుకున్న రుణాలను ఆసరాగా చేసుకొని కొత్తగా రెగ్యులైజ్ చేయించుకోవాలంటూ పేద‌ల‌కు నోటీసులు!
నిన్నటికి నిన్న ప్ర‌భుత్వ స్థ‌లాల్లో ఎప్పుడో ఇళ్లు క‌ట్టుకున్న బ‌డుగుల‌కు రెగ్యులైజేష‌న్ నోటీసులు!
ఇప్పుడు ద‌శాబ్ధాల క్రితం ఇళ్లు క‌ట్టుకున్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ నోటీసులు!
ఏవేవో చట్టాల పేరు చెప్పి పేద‌ల నుంచి, సామాన్యుల నుంచి, మ‌ధ్య‌త‌ర‌గతి వ‌ర్గాల నుంచి కోట్ల‌కు కోట్లు దండుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోందంటూ ప్ర‌తిప‌క్షాలు చేసే విమ‌ర్శ‌ల‌కు సాక్ష్యంగా తాజా నోటీసులు నిలుస్తున్నాయన‌డానికి అనేక ఉదాహ‌ర‌ణ‌ క‌నిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం…
* విజ‌య‌వాడ ఎస్‌బీహెచ్ హౌసింగ్ సొసైటీలో ఓ స‌భ్యుడు 1955లోనే 300 గ‌జాల స్థ‌లం కొనుక్కుని ఇళ్లు క‌ట్టుకున్నారు. ఆ ఇంటికి రిజిష్ట్రేష‌న్ స‌హా అన్నిప‌త్రాలు ఉన్నాయి. ద‌శాబ్దాలుగా ఆస్తి ప‌న్ను క‌డుతున్నారు. ఇప్పుడు ఆ వ్య‌క్తికి అర్భ‌న్ సీలింగ్ యాక్ట్ ప్ర‌కారం నోటీసులు అందాయి. వాటి ప్ర‌కారం ఇప్పుడు ఆ స‌భ్యుడు ఏకంగా 2.7 కోట్ల రూపాయ‌లు చెల్లించాలి! ఇంకా ఆ సొసైటీలో మొత్తం 28 మందికి నోటీసులు అందాయి.
వీళ్లే కాదు, విజ‌య‌వాడ న‌గ‌రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న దాదాపు 1205 మందికి నోటీసులు అందాయి. ఇలా ఒక్క విజ‌య‌వాడ‌లోనే కాదు… విశాఖ‌, తిరుప‌తి, గుంటూరు త‌దిత‌ర న‌గ‌రాల్లో వంద‌లాది మందికి కూడా తాఖీదులు అందాయి. వీళ్లంతా ఆయా ప్రాంతాల్లో ఉన్న రిజిస్ట్రేషన్ బేసిక్ విలువ‌కు ఒకటిన్నర రెట్లు చొప్పున చెల్లించి క్రమబద్ధీకరణ చేయించుకోవాలనేది ప్రభుత్వ ఉత్తర్వుల సారాంశం. ఇలా ల‌క్ష‌ల్లో, కోట్ల‌లో ఉన్న‌ట్టుండి క‌ట్టాలన‌డంతో క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. నోటీసులు అందిన నెల రోజుల్లోగా రెగ్యులైజేష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని, దాంతో పాటు స‌గం సొమ్మును త‌క్ష‌ణం జ‌మ చేయాల‌ని, ఈ మొత్తం వ్య‌వ‌హారానికి జూన్ 30 గ‌డువ‌ని పేర్కొన‌డంతో వేలాది మంది న‌గ‌ర వాసులు సంక్షోభంలో ప‌డ్డారు.

ఇదెక్క‌డి అన్యాయం?
క‌ష్ట‌ప‌డి సంపాదించుకుంటూ పైసా పైసా దాచుకుని ఏ వాయిదాల ప‌ద్ధ‌తిలోనో డ‌బ్బులు చెల్లిస్తూ ఎప్పుడో 50, 60 ఏళ్ల క్రితం సొసైటీల్లో స్థలాలు కొనుక్కుని ఇళ్లు క‌ట్టుకుని నిశ్చింత‌గా ఉన్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాసులను ఇప్ప‌టికిప్పుడు ల‌క్ష‌ల‌, కోట్ల రూపాయ‌లు క‌ట్ట‌మ‌ని వేధించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బ‌నే ఆక్రోశం అంత‌టా వ్య‌క్త‌మ‌వుతోంది. ఆయా స్థ‌లాల‌న్నీ రిజిష్ట‌ర్ అయిన‌వే అయిన‌ప్పుడు, ఇన్ని ద‌శాబ్దాలుగా ప‌న్నులు క‌డుతున్న‌ప్పుడు భూప‌రిమితి ప‌రిధిలోనో, మిగులు భూముల ప‌రిధిలోనో ఉన్నారంటూ నోటీసులు ఇవ్వ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇన్ని ద‌శాబ్దాలుగా ఆయా ప్రాంతాల్లో భూముల విలువ స‌హ‌జంగానే ఎన్నో రెట్లు పెరిగి ఉంటుంద‌నేది స‌త్యం. అలాంటిది 1976 నాటి చ‌ట్టాన్ని ఉటంకిస్తూ ప్ర‌స్తుత రిజిస్ట్రేషన్ బేసిక్ విలువ ప్ర‌కారం చెల్లించాల‌ని ఆదేశాలు జారీ చేయ‌డం అత్యంత దారుణ‌మ‌నే ఆవేద‌న స‌ర్వ‌త్రా వ్య‌క్త మ‌వుతోంది. వీరి ఆవేద‌న‌కు, ఆక్రోశానికి జ‌వాబు చెప్పే వారు క‌నిపించ‌డం లేదు. జ‌వాబు చెప్పాల‌నే బాధ్య‌త కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌డం లేదు.