పది.. ఈ పాపమెవరిది..?

• ఉత్తీర్ణత తగ్గడానికి వైసీపీ విధానాలే కారణం
• ఉపాధ్యాయులకు బోధనేతర విధులతో ఇబ్బందులు
• ఆంగ్ల మాధ్యమ ప్రవేశంతో తికమక
• విద్యావ్యవస్థలో మార్పులు చేర్పులతో గడబిడ

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గడానికి వైసీపీ పాలకులు గత ఏడాది చెప్పిన కాకమ్మ కథలకు కాలం తీరిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నామమాత్రపు ఉత్తీర్ణత శాతమే నమోదు అయింది. గత ఏడాది కంటే మెరుగైందని అధికారులు సర్దిచెప్పుకుంటున్నప్పటికీ… పూర్తిస్థాయిలో తరగతులు జరిగిన ఏడాది కూడా అంతంత మాత్రంగానే ఉత్తీర్ణత రావడం వెనుక అసలు కారణాలను వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తిస్తే మేలు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ తీరు మీద సమీక్షించి, చర్యలు చేపడితేనే భవిష్యత్తు బాగు.
• 2019 – 94.8 శాతం
• 2020 – పరీక్షలు రద్దు
• 2021 – పరీక్షలు రద్దు
• 2022 – 67 శాతం
• 2023 – 72 శాతం
• 2019తో పోల్చితే 2022లో 27 శాతం ఉత్తీర్ణత తగ్గింది. అదే ఈ ఏడాది 22 శాతం ఉత్తీర్ణత తగ్గింది. గత ఏడాది ఉత్తీర్ణత తగ్గడానికి రకరకాల కారణాలు చెప్పిన ప్రభుత్వం ఈ ఏడాది చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామని, అద్భుతాలు చేస్తున్నామని ఊదరగొడుతున్న వైసీపీ ప్రభుత్వానికి ఇది నిజంగా చెంపపెట్టులాంటిదే.
• గత ఏడాది పరీక్షలు ప్రారంభమవ్వగానే మాస్ కాపీయింగ్ విమర్శలు, పేపర్ లీక్ ఆరోపణలతో గందరగోళం ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో పరీక్షలు రద్దవుతాయేమోననే ఆందోళన కనిపించింది. మొదటి మూడు రోజులు జరిగిన తెలుగు, హిందీ, ఆంగ్ల భాష పరీక్షల్లో ఎక్కువ మంది పాస్ కాగా, ఆ తర్వాత జరిగిన గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం పరీక్షల్లో ఎక్కువ మంది ఫెయిలయ్యారు.
• ముఖ్యంగా విద్యా వ్యవస్థను వైసీపీ అల్లకల్లోలం చేసింది. రకరకాల మార్పులతో గందరగోళం చేసింది. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో 10 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది బోధనపై ప్రభావం చూపింది. దీంతో పాటు సర్దుబాటు పేరుతో పాఠశాలల తీరు మార్చివేయడం, సబ్జెక్టు నిపుణులు లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది.
• పేపర్ల విధానంలో కూడా మార్పులు తెచ్చారు. 2019 వరకు 11 పేపర్లు ఉండగా.. వాటిని ఏడు పేపర్లకు తగ్గించారు. ఒకే సబ్జెక్టుని 50 మార్కుల చొప్పున రెండు సార్లు రాస్తే ఇప్పుడు వంద మార్కులకు ఒకేసారి రాయాల్సి వస్తోంది. దీనిపై ఎలాంటి ట్రయల్ లేకుండానే ప్రవేశ పెట్టడం విద్యార్థులకు లేనిపోని కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇది విద్యార్థులపై ఒత్తిడి పెంచింది.
• పాఠాలు చెప్పే ఉపాధ్యాయులపై బోధనేతర విధులను ప్రభుత్వం వేయడం బాగా ప్రభావం చూపింది. విద్యార్థులకు సంబంధించిన 32 బాధ్యతలను చూసుకోవడం, దానిని ఆన్ లైన్ లో ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేసే పనులు చేసుకోవడంతో పనిభారం పెరిగింది. ఇది విద్యార్థులకు బోధించే విషయంలో కూడా ప్రతికూల ప్రభావం చూపింది. తమను బోధనేతర విధుల నుంచి తప్పించాలని ఉపాధ్యాయులు కోరినా, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు.
• కరోనా సమయంలో అలవాటుగా మారిన ఆన్ లైన్ క్లాసుల సంస్కృతి తర్వాత కొనసాగింది. ముఖ్యంగా బైజూస్ ట్యాబ్ లు పంచామంటూ, దానిలోనే చదువుకోవాలని చెప్పిన తీరుతో, ఇప్పుడు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపై పడింది. అప్పట్లో 8వ తరగతి విద్యార్థులు ఇప్పుడు పది పరీక్షలకు హాజరు కావడంతో వారు సరిగా పరీక్షలను ఎదుర్కోలేకపోయారు.
• పుస్తకాల రాక ఆలస్యం అయింది. సిలబస్ ఎలా చెప్పాలో కూడా కొంతకాలం అర్ధం కాలేదు. విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలను అందించడంలో ప్రభుత్వం విఫలమయింది. సర్దుబాటు చేసుకొని ఏడాది అంతా చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
• పది విద్యార్థులకు ఒకేసారి ఆంగ్లంలో బోధన ప్రవేశ పెట్టడం తీవ్ర గందరగోళానికి గురి చేసింది. అప్పటి వరకు తెలుగులో చదువుకున్న విద్యార్థులు ఒక్కసారిగా ఆంగ్లంలోకి మారిపోవడం విపరిణామాలకు దారి తీసింది. వారికి బోధించే ఉపాధ్యాయులకు సైతం ఇంగ్లీషు బోధన సవాల్ విసిరింది. ఎలాంటి ప్రయోగం లేకుండా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఈ మార్పు సైతం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడింది.
• పది విద్యార్థులకు ప్రత్యేక తరగతుల కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చొరవ అంతంత మాత్రమే. దీంతో తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులు అలాగే మిగిలిపోయారు. గతంలో ప్రత్యేక తరగతుల నిర్వహణ, అలాగే పరీక్షలకు ముందుగా విద్యార్థులకు పౌష్ఠికాహారం పెట్టి ప్రత్యేక తరగతులు ఉండేవి. దీనికి ప్రత్యేక నిధులు అందేవి. ప్రస్తుతం అలాంటివేం లేకపోవడంతో వెనుకబడిన విద్యార్థులు అలాగే ఉండిపోయారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.