భాష మార్చుకోండి… అభివృద్ధికి పాటుపడండి

*హుందా రాజకీయాలతోనే నేతలకు విలువ
*జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్
*జనసేన పార్టీ నాయకురాలు విజయ దుర్గ

కొండపల్లి మున్సిపాలిటీ, గత కొద్ది కాలంగా మీడియాలో వస్తున్న వైసీపీ, టీడీపీ పరస్పర విమర్శలు ఆవేదన కలిగించాయని రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలని అన్నారు జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, కొండపల్లి మున్సిపాలిటీ నాయకురాలు విజయ దుర్గ. శుక్రవారం నాడు తమ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలంతో భావితరాలకు ఏం సమాధానం చెబుతారు? అని సూటిగా ప్రశ్నించారు. నమ్మి గెలిపించిన ప్రజలకు ఇదేనా మీరు ఇచ్చే బహుమతి అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలతో కూర్చొని అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగటం మీ సంస్కారమా, సొంత ఎజెండాలు మాని కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ఎజెండాలు పెట్టాలని హితవు పలికారు. మీ రాజకీయాలతో కొండపల్లి చరిత్రకు చెడ్డపేరు తేవద్దని, ప్రజాప్రతినిధులు సంయమనం పాటించాలన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ పలు సమస్యల వలయంలో ఉందని, సమష్టి కృషితో మున్సిపాలిటీని అభివృద్ధి చేయండి.జనసేన ఎప్పుడు మీకు సహకరిస్తుందన్నారు. నీతి, నిజాయితీ, నైతిక విలువలు కలిగిన రాజకీయాలను జనసేన పార్టీ ప్రోత్సహిస్తుందని, ప్రజల్లో కాదు నాయకుల్లో మార్పు రావాలని, మున్సిపాలిటీకి ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇరు పార్టీలు మతిభ్రమించి మాట్లాడుతున్నారా…..? అని ప్రశ్నించారు.

విజయదుర్గ మాట్లాడుతూ… కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు చాలా ఉన్నాయని, వాటిని వదిలేసి దూషణలకు దిగటం తగదన్నారు. డాక్టర్ ఎన్టీటీపీఎస్ పై మండల నాయకులు చేస్తున్న పోరాటం హర్షణీయమని, కొండపల్లి మున్సిపాలిటీ నాయకులు, కౌన్సిలర్లు పోరాటం చేసేందుకు ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. కోటకు సరైన నడక దారి ఏర్పాటు, వేసవికాలంలో మంచినీటి కొరత లేకుండా చేయడం, సరైన ఉద్యోగులు లేక మున్సిపాలిటీలో పనుల జరగకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మున్సిపాలిటీ ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు, ఆర్సీలు ద్వారా మున్సిపాలిటీ ఆదాయం పెంచుకోవచ్చన్నారు. పలు సమస్యలు ఉన్నాయని, వాటిపై దృష్టి పెట్టాలన్నారు. వ్యక్తిగత దూషణలు, విమర్శలపై పోటీపడుతున్న మీరు కొండపల్లి అభివృద్ధికి ఎందుకు పోటీపడలేక పోతున్నారని ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ నాయకులు దూషణలకు సమయం కుదురుతుంది తప్ప.. సమస్యలు పట్టించుకునే సమయం దొరకడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా మార్పు చెంది భావితరాలకు ఆదర్శంగా నిలవాలని, అభివృద్ధికి మీతో జనసేన నడిచేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉందని తెలిపారు.