హత్రాస్ బాధితురాలి కుటుంబానికి పరిహారo

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో గ్యాంగ్ రేప్ కు గురై మరణించిన యువతి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని యోగి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ఇల్లు, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది. ఈ కేసు దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెప్పింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేను విచారణ జరిపించి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం బాధిత కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

కాగా, రెండు వారాల క్రితం యూపీలోని హత్రాస్‌ లో 19 ఏళ్ళ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెకు తొలుత అలీఘర్‌లో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. పక్షవాతంతో పాటు శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలుగా చిత్రవధ అనుభవించిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను కోరారు.

ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

హత్రాస్‌ ఘటనకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ నాలుగు వారాల్లోగా యూపీ ప్రభుత్వ యంత్రాంగం దీనిపై బదులివ్వాలని కోరింది. బాధిత బాలిక కుటుంబానికి, సాక్షులకు సరైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. రెండు వర్గాల మధ్య వివాదం నెలకొనే పరిస్ధితుల నేపథ్యంలో బాధిత మహిళ కుటుంబానికి హాని జరగకుండా చర్యలు చేపట్టాలని కోరింది. నిందితులకు ఎలాంటి జాప్యం లేకుండా శిక్ష పడేలా విచారణను వేగవంతం చేసేందుకు వ్యక్తిగతంగా ఈ అంశంపై చొరవ చూపాలని యూపీ డీజీపీని కమిషన్‌ కోరింది.