సంచలన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై సూపర్‌కింగ్స్‌ గెలుపు బాటలోకి వచ్చింది. సీజన్‌ ఆరంభ మ్యాచుల్లో వేధించిన ఓపెనింగ్‌ సమస్య.. తాజాగా ఆ జట్టుకు బలమైంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి మరో ఆసక్తికర మ్యాచ్ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్‌, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు నువ్వా-నేనా అంటూ తలపడ్డాయి. కానీ ఈ మ్యాచ్‌లో చెన్నై ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సంచలన విజయం సాధించింది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై చెన్నై ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి మూడు ఓటములతో చెన్నై కెప్టెన్ ధోనీతో పాటు చెన్నై టీమ్ పై చాలా విమర్శలు వచ్చాయి. కానీ అవన్నీ ఒక్క మ్యాచ్‌తో సైడయ్యాడు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో చెన్నై ఏకపక్ష ప్రదర్శన చేసింది. చెన్నై ఓపెనర్లు డుప్లెసిస్‌(87 నాటౌట్: 53 బంతుల్లో 11ఫోర్లు, 1సిక్స్‌), షేన్‌ వాట్సన్‌(83 నాటౌట్‌: 53 బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సర్లు ) అజేయంగా నిలిచి జట్టుకు అద్బుత విజయాన్ని అందించారు. పంజాబ్‌ బౌలర్లు ఏ దశలోనూ ఈ ద్వయాన్ని అడ్డుకోలేకపోయారు. పంజాబ్‌ బౌలర్లు తేలిపోవడంతో చెన్నై ఎలాంటి తడబాటుకు గురికాకుండా అవలీలగా విజయాన్ని అందుకుంది.

అంతకుముందు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(63: 52 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌), నికోలస్‌ పూరన్‌(33: 17 బంతుల్లో ఫోర్‌, 3సిక్సర్లు) రాణించడంతో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 రన్స్ చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను రాహుల్‌ ఒంటిచేత్తో నడిపించాడు. మయాంక్‌ అగర్వాల్‌(26), మన్‌దీప్‌ సింగ్‌(27) రాణించారు. చెన్నై బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు పడగొట్టగా జడేజా, చావ్లా చెరో వికెట్‌ పడగొట్టారు.