సిడ్నీ టెస్టు మూడవరోజు.. ఆధిక్యంలో ఆసీస్

భారత్‌తో జరుగుతున్న మూడవ టెస్టులో ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 103 రన్స్ చేసింది. దీంతో ఆసీస్‌కు ఇప్పటి వరకు 197 పరుగుల ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ లబుషేన్‌, స్టీవ్ స్మిత్‌లు ఇంకా క్రీజ్‌లోనే ఉన్నారు. ఆ ఇద్దరూ భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశారు. లబుషేన్ 47, స్మిత్ 27 రన్స్‌తో బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం ఆసీస్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సఫలం అయ్యారు. ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 244 పరుగులు చేసి ఆలౌటైంది. భారత జట్టులో పూజారా 50 రన్స్ చేశాడు. అయితే రెండవ సెషన్‌లో పంత్‌, పుజారాలు త్వరత్వరగా ఔట్ కావడంతో.. భారత ఇన్నింగ్స్ కుంటుపడింది. చివర్‌లో జడేజా 28 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

పంత్‌, జడేజాకు గాయాలు

రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. బంతి అతని ఎడమ మోచేతికి తగలడంతో ఇబ్బందిపడ్డాడు. పంత్‌ను స్కానింగ్‌కు తీసుకువెళ్లినట్లు బీసీసీఐ చెప్పింది. అయితే రెండవ ఇన్నింగ్స్‌లో పంత్ స్థానంలో సాహా కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. కేవలం సబ్‌స్టిట్యూట్‌గా మాత్రమే అతను కీపింగ్ చేస్తున్నాడు. రవీంద్ర జడేజా కూడా గాయపడ్డాడు. అతనికి బొటనవేలుకు గాయం కావడం వల్ల ఫీల్డింగ్‌కు రాలేదు.

స్కోరు బోర్డు

ఆస్ట్రేలియా 338 & 103/2

ఇండియా 244