IPL 2020 పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విక్టరీ

షార్జా వేదికగా రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో 46 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 184 పరుగుల భారీ స్కోర్ సాధించగా.. రాజస్థాన్ 138 పరుగులకే కుప్పకూలిపోయింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. షిమ్రాన్‌ హెట్‌మైర్‌ (24 బంతుల్లో 45; 1 ఫోర్, 5 సిక్సర్లు), స్టొయినిస్‌ (30 బంతుల్లో 39; 4 సిక్సర్లు) మెరిపించారు. ఆర్చర్‌ 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 19.4 ఓవర్లలో 138 పరుగులే చేసి ఆలౌటైంది. రాహుల్‌ తేవటియా (29 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్‌ (36 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుగనిపించారు. ఢిల్లీ బౌలర్‌ రబాడా 3 వికెట్లు తీశాడు. కీలకమైన 2 వికెట్లు తీసిన అశ్విన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

ఈ మ్యాచ్‌లో 82 పరుగులకే రాజస్తాన్‌ సగం వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ కంటే మరో ఓపెనర్‌ బట్లర్‌ (13) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. కెప్టెన్‌ స్మిత్‌ (17 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కంటే నిర్లక్ష్యంగా సామ్సన్‌ (5) వికెట్‌ పారేసుకున్నాడు. ఆండ్రూ టై (6), ఆర్చర్‌ (2)లు కూడా బ్యాట్‌లు ఎత్తేయడంతో 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన రాయల్స్‌ లక్ష్యానికి అసాధ్యమైన దూరంలో నిలిచింది. తేవటియా కొట్టిన ఫోర్లు, సిక్సర్లు రాజస్తాన్‌ ఓటమి అంతరాన్ని తగ్గించాయే తప్ప గెలిచేందుకు పనికి రాలేదు. బ్యాటింగ్‌లో మెరిపించిన స్టొయినిస్‌ (2/17) కీలకమైన వికెట్లతో బంతితోనూ రాజస్తాన్‌ను దెబ్బతీశాడు.