ముస్లిం మైనారిటీ పథకాలను ఫ్యాను గాల్లో కలిపేసిన అబద్దాల ముఖ్యమంత్రి

కుప్పం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గుడిపల్లె మండల అధ్యక్షులు అమీర్ మాట్లాడుతూ… ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ముస్లిం మైనారిటీ విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను ఇంతవరకు చెల్లించకపోవటం, ఉర్దూ భాషాభివృద్ధికి పాటుపడుతున్న ఉర్దూ అకాడమీ ఉద్యోగులకు జీతాలు, ఉర్దూ లైబ్రరీలకు అద్దెలు చెల్లించకపోవడం చూస్తుంటే, ముస్లిం మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తున్నదనేది ఇట్టే ఎవరికైనా అర్థమైపోతుందని, దుల్హన్‌ పథకం కింద రూ.50 వేలు గత ప్రభుత్వం ఇస్తుంటే, తాను అధికారంలోకి వచ్చాక రూ.లక్ష ఇస్తానని చెప్పిన సీఎం ఇప్పుడు ముస్లిం మైనారిటీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జగన్‌కు అల్విదా చెప్పేందుకు మా మైనారిటీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాష్ట్రంలో రికార్డులు బ్రేక్‌ చేసేలా అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నాయని, యువత సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కింద రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తామని మాట ఇచ్చి, ఇప్పుడు మాట తప్పుతున్న జగన్మోహన్ రెడ్డి కి అసలు మడమ అనేది ఉందా? 2019 ఎన్నికల ప్రచారంలో ముస్లింలకి దుల్హన్ పథకం ప్రకారం లక్ష రూపాయలు ఇస్తామన్న ముఖ్యమంత్రి నేడు నిధులు లేవని హైకోర్టు లో అఫిడవిట్ దాఖలు చేయడం సిగ్గు చేటని చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి వేణు దుయ్యబెట్టారు. ముస్లింలకు ప్రత్యేక బ్యాంక్ పెడతానని, మౌల్వీలకి, ఇమామలకి ఇల్లు కట్టిస్తామని ఒక్కరికి కూడా ఇల్లు కట్టి ఇవ్వకపోవడం, నాలుగు రాజ్యసభ సీట్లలో ఒక్కటి కూడా మైనార్టీలకు కేటాయించకపోవడం చూస్తే జగన్ రెడ్డికి ముస్లింలపై ఉండే సవతి ప్రేమ అర్థమవుతుందని రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి వామన మూర్తి విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి వినోద్, నియోజకవర్గ సమన్వయకర్త అరుణ్ మరియు మండల నాయకులు రంజిత్, మురుగేష్, బాబు, మంజు, వెంకటేష్, జామీర్, సర్ధార్, వెంకటాచలపతి తదితరులు పాల్గొన్నారు.