వంగవీటి మోహన రంగా కు ఘన నివాళులు అర్పించిన డా. సాయి శరత్

దెందులూరు: ఒక వ్యక్తి రూపం ప్రజల గుండెల్లో ధైర్యాన్ని నింపగలదు అంటే అది కేవలం రంగా గారి రూపం మాత్రమే. రంగా అంటేనే ఒక శక్తి.. ఒక ధైర్యం. విజయపథం చూపిన నాయకుడాయన. బడుగు బలహీన వర్గాలకు అన్యాయం ఎక్కడ జరిగినా ఆయన అక్కడ ప్రత్యక్షమై వారి వెంట దన్నుగా ఉండి వారికి న్యాయం చేకూరే వరకు పోరాటాలు చేసిన ధన్యజీవి. ఇవాళ చాలా మంది యువతకి ఆయన ఎందుకు అంత గొప్ప నాయకులయ్యారు.. ఎలాంటి మంచి పనులు చేశారన్న విషయాలు తెలియనివ్వకుండా చేశారు. చరిత్రను కావాలని మంటగలిపేశారు. అటువంటి వ్యక్తిని ఒక కులానికే పరిమితి చెయ్యడం పిచ్చితనం. నీరుకోండలో దళితవాడలో జరిగిన మారణకాండ విషయం తెలిసి వెళ్తే అక్కడి భాదిత దళితులందరూ అయన్ని కావలించుకుని కన్నీరు మున్నీరయ్యారే.. అప్పుడేమైంది ఆయన కులం.. లారీలలో తీసుకువెళ్ళిన బియ్యం, రగ్గులు, నిత్యావసరాలు పంచినపుడు మాట్లాడలేదే ఆయన కులం..? ఆయనొక రణనినాదం.. ఆయన దయాగుణం అమోఘం.. ఆయన కీర్తి అజరామరం. శాసనసభ్యులుగా చేసింది కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు, అందరి ఇళ్ళలో టి.వి లు కూడా అందుబాటులో లేని రోజులు. ఆయన కనీసం సినిమా నటుడు కూడా కాదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్న అభిమానం అనంతం. నరనరాల నెత్తురుడికి యువతరాల శక్తి పెరిగి అధికారమదాంధులకు సింహస్వప్నంగా సామాన్యున్ని కదిలించి నడిపించిన వ్యక్తి అని డా. వడ్లపట్ల సాయి శరత్ దెందులూరు నియోజకవర్గంలో రంగా 75 వ జయంతి వేడుకల పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు.