కాపులపై జగన్ రెడ్డిది కపట ప్రేమ

  • కాపులపై జగన్ రెడ్డిది కపట ప్రేమ
  • కాపులకు ఈబీసీ రిజర్వేషన్ తొలగించిన ద్రోహి జగన్
  • కాపు కార్పొరేషన్ కు ఏటా ఇస్తామన్న రూ. 2 వేల కోట్లు ఏమైయ్యాయి?
  • కాపు సంక్షేమానికి వెచ్చించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయండి
  • కాపులు అమ్ముడుపోతారని సీఎం మాట్లాడుతుంటే వేదికపై ఉన్న కాపు నాయకులకు పౌరుషం రాలేదా?
  • మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ నాయకులు సుందరపు విజయ్ కుమార్, షేక్ రియాజ్

కాపుల సంక్షేమం కోసం ఏటా రూ.2 వేలు కోట్లు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కాకి లెక్కలను పక్కన పెట్టి, గత మూడేళ్లలో కాపులకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. వివిధ పథకాలకు ఇచ్చిన నిధులన్నీ కాపుల కోటాలో చూపిస్తూ మోసం చేయడం మానుకొని, కాపులకు ఈ ప్రభుత్వం చేసిన అసలైన లబ్ధిని చూపించాలన్నారు. ఈబీసీ కోటాలో కాపులకి ఉన్న రిజర్వేషన్ తొలగించి కాపు జాతికి ద్రోహం చేసింది శ్రీ జగన్ రెడ్డి అని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విజయ్ కుమార్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడారు.

ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ కాపులకు ఎలాంటి రిజర్వేషన్లు ఇచ్చేది లేదని ఎన్నికల సభల్లో ఖరాఖండిగా చెప్పిన ఈ ముఖ్యమంత్రి కాపులకు లబ్ధి చేశారంటే నమ్మే పరిస్థితి లేదు. కాపు మంత్రులను కేవలం మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. వారికి మరే పనీ ఉండదు. అధికారం అసలే ఉండదు. ఈబీసీ రిజర్వేషన్లలోనూ ఈ ప్రభుత్వం కాపులకు అన్యాయం చేసింది. ఈబీసీ రిజర్వేషన్లలో కాపులకు ప్రత్యేకంగా ఇచ్చిన 5 శాతం కోటాను కూడా తీసేసి.. కాపులకు ఏదో అద్భుతం చేశామని ఈ ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటు. సీఎం మాటలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. వివిధ పథకాల ద్వారా కాపులకు అందిన ప్రతిఫలాన్ని సైతం కాపుల సంక్షేమం కోటాలో పెట్టడం ఈ ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో భాగం.

బటన్ రెడ్డి గారూ… పిల్లికి చారలుంటే పులి కాదు

కాపులను ప్రతిసారీ అవమానిస్తూ… కాపు సామాజిక వర్గ నేతలతోనే బూతులు తిట్టిస్తున్న ఈ ముఖ్యమంత్రి తీరును కాపు సోదరులు గమనిస్తున్నారు. ఏవేవో లెక్కలు చెప్పి, కాపులకు ఏదేదో చేస్తున్నాం అని మభ్యపెట్టాలని చూస్తున్న ఈ ప్రభుత్వ తీరును ప్రతి ఒక్కరూ ఎండగట్టాల్సిన అవసరం ఉంది. బటన్ నొక్కితే అద్భుతాలు జరిగిపోతాయని భావిస్తున్న ఈ ముఖ్యమంత్రి కాపు కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. దాని నుంచి ఎలాంటి ప్రయోజనం లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. కనీసం కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ ఎవరో కూడా సగటు కాపులకు తెలియదు. కాపులకు అద్భుతాలు చేశామని చెబితే, ఎవరూ నమ్మే పరిస్థితి లేదనే విషయాన్ని ఈ బటన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. కాపులు అమ్ముడుపోతారు అని అవమానిస్తుంటే వేదిక మీద ఉన్న కాపు నేతలకు పౌరుషం రాలేదా పిల్లికి పులి చారలు ఉన్నంత మాత్రాన పులి కాదు.. అలాగే కాపులకు ప్రత్యేక నిధులు ఇవ్వకుండా వేరే పథకాలు పేరుతో ఉన్న నిధులు ఇచ్చినంత మాత్రాన కాపు సంక్షేమం కాదు అనే విషయాన్నీ బటన్ రెడ్డి గారూ, ఆయన అభిమానులు గుర్తుంచుకోవాలి’ అన్నారు.

పరామర్శకు వెళ్లి పళ్లు ఇకిలించే ముఖ్యమంత్రి బటన్ రెడ్డి: షేక్ రియాజ్

జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఇంఛార్జు షేక్ రియాజ్ మాట్లాడుతూ… కాపు సామాజిక వర్గంతోపాటు రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. కులం చూడం… మతం చూడం… ప్రాంతం చూడం.. అని పెద్ద పెద్ద మాటలు చెప్పిన ముఖ్యమంత్రి బటన్ రెడ్డి… అన్ని వర్గాలను నిలువునా ముంచారు. కాపు నేస్తం కార్యక్రమంలో కాపులు అమ్ముడుపోతారని బటన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే వేదికపై ఉన్న కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడం సిగ్గు చేటు. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లి పళ్ళు ఇకిలించే వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి బటన్ రెడ్డి మాత్రమే.

కాపు సామాజిక వర్గ విలేకరి హత్య కేసులో మంత్రి రాజా నిందితుడు:

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై ముఖ్యమంత్రి అవాకులుచవాకులు పేలుతుంటే అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి దాడిశెట్టి రాజా వత్తాసు పలుకుతూ మాట్లాడారు.
రాజ్యాధికారం కోసం కాపులు జనసేన వెంట నడుస్తుంటే… అదే సామాజిక వర్గానికి చెందిన విలేకరి శ్రీ కాటా సత్యనారాయణను మంత్రి రాజా చంపించిన మాట వాస్తవం కాదా? అరకు నుంచి గంజాయిని తెప్పించి తుని నియోజకవర్గంలో నిల్వ చేసి వివిధ ప్రాంతాలకు తరలించే పనిలో రాజా పాత్ర ఉన్న మాట వాస్తవం కాదా? దాడిశెట్టి రాజా, అతని కుటుంబం చేసే దొంగ బంగారం వ్యాపారం గురించి నియోజకవర్గంలో కథలు కథలుగా చెబుతారు. మంత్రివర్గంలో అత్యంత వ్యసనపరుడు ఎవరు అని చేతులు ఎత్తమంటే రెండు చేతులూ ఎత్తగల ఘనుడు దాడిశెట్టి రాజా. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి సభకు రెండు పెగ్గులు ప్రెసిడెంట్ మెడల్ వేసుకొని వెళ్లి ఉంటాడని అనిపిస్తోంది అన్నారు.