సర్దార్ – ఉక్కు మనిషి – ఇండియన్ బిస్మార్క్‌ : వల్లభాయ్ పటేల్

భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన సామాజిక రాజకీయ నాయకుడు. వల్లభాయ్ పటేల్ ను ‘సర్దార్’ అని పిలుస్తారు, ‘సర్దార్’ అంటే ‘నాయకుడు’ అని అర్థం. భారతదేశ సమైక్యతకు పాటుపడిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశ తొలి ఉప ప్రధాని, హోంమంత్రి, సమాచార ప్రసార శాఖ మంత్రిగా దేశ నిర్మాణ బాధ్యతలు చేపట్టి దేశం ముక్కలుకాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో 562 సంస్థానాలను విలీనం చేయడానికి సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగించి దేశ సమైక్యతను సాధించారు. 562 సంస్థానాలను విలీనం చేసిన ఘనకీర్తి ఆయనది.  భారతదేశo సమైక్యoగా ఉంది అంటే ముఖ్య కారణం అయన చతురతే… అలాంటి గొప్పవ్యక్తి గురించి మనం తెలుసుకుందామా…?

వల్లభాయ్ పటేల్ జననం మరియు విద్యాభ్యాసం:

సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబరు 31న నడియార్ లోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి జవేరిభాయ్ పటేల్ ఒక సాధారణ రైతు మరియు తల్లి లాడ్ భాయ్ ఒక సాధారణ మహిళ. పటేల్ చిన్నప్పటి నుండి తాను బారిష్టర్ కావాలని కోరుకున్నారు… కానీ ఆ కల నెరవేరాలంటే ఇంగ్లండ్ వెళ్లాలి, సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన పటేల్ స్థితిగతులు ఇక్కడ కళాశాలలో చేరడానికే సరిపడవు ఇక ఇంగ్లాండ్ వెళ్లి చదవాలంటే….? దృఢ సంకల్పం కలవారికి అడ్డంకులేరావు అన్నట్టుగా… ఆయన కన్న కలలు సాకారం కావాలన్న దృఢ నిశ్చయంతో తనకు తానే బోధించుకొనే ఒక మార్గం కనుగొన్నారు. ఒక న్యాయవాది స్నేహితుని దగ్గర పుస్తకాలు తీసుకుని చదివేవారు. వ్యవహార శిక్షణ కొరకు ప్రతివాదనలు జాగ్రత్తగా  పరిశీలించడానికి న్యాయస్థానానికి వెళ్లేవారు. పరీక్షలలో విజయం సాధించి గోద్రాలో న్యాయవాదవృత్తి ప్రారంభించారు. తనకు తగిన సామర్థ్యం ఉన్నప్పటికీ, అప్పటికే న్యాయవాదవృత్తిలో కొనసాగుతున్న తన అన్నగారిని మొదటగా ఇంగ్లాండ్ పంపేందుకు సహకరించిన  ఆయన గొప్పదనం గమనించవచ్చు. ఆ తదుపరి ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ బారిష్టర్ పరీక్షలో ప్రధముడిగా నిలిచారు.

స్వాతంత్ర్య పోరాటంలోకి ప్రవేశం:

మహాత్మాగాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యి పటేల్ స్వాతంత్ర్య పోరాటంలోకి వచ్చారు. ఆయనను పటేల్ ఒక సమావేశంలో కలిసారు. అప్పటినుండి పటేల్ గాంధీ కార్యక్రమాలను అనుసరించేవారు, వాటిలో ‘చంపారన్ సత్యాగ్రహం’ ఒకటి. గుజరాత్ లోని ఖేడా బోర్సాద్ బోర్దోలీల  రైతులను బ్రిటిష్ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా అహింసా పూర్వక శాసనోల్లంఘన ఉద్యమంలో సంఘటితంచేశారు. దీనితో ఆయన గుజరాత్ లోని ప్రముఖ నాయకులలో  ఒకరయ్యారు. పటేల్ భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వ స్థాయికి ఎదిగి 1934, 1937లో జరిగిన పార్టీ ఎన్నికలలో ఎన్నికల నిర్వహణ బాధ్యతను చేపట్టారు. క్విట్ ఇండియా ఉద్యమ ప్రోత్సాహం కార్యక్రమాల్లో, తిరుగుబాటు  రాజకీయ కార్యక్రమాలలో ముందంజలో ఉన్నారు.

మొట్ట మొదటి ఉపప్రధానిగా:

భారతదేశం మొట్ట మొదటి ఉపప్రధానిగా శరణార్దుల కొరకు పంజాబ్ ఢిల్లీలో సహాయ కార్యక్రమాలు నిర్వహించి దేశవ్యాప్తంగా శాంతిని నెలకొల్పారు. 565 సంస్థానాలను కలిపే బాధ్యతను తీసుకున్నారు. సైనిక బలాన్ని ఉపయోగించే స్వేచ్ఛతో దాదాపు అన్ని సంస్థానాలు భారత్ యూనియన్లో విలీనం అయ్యాయి. అప్పుడే ఆయనను అందరూ ఉక్కు మనిషిగా కీర్తించారు. భారతదేశ సమైక్యతకు మార్గం సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం. ఆయన సుపరిపాలన, సమైక్యత  స్వాతంత్ర్యానంతరం భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. ఆయన మన దేశ రైతులను సమీకరిoడంలోనూ స్వాతంత్ర్య పోరాటంలోకి వివిధ కులాలను చేర్చడంలోనూ సాధనంగా మారారు.

స్వాతంత్ర్య అనంతరం:

స్వాతంత్ర్య అనంతరం దేశంలో ఏర్పడ్డ అనిశ్చితిని, అనైక్యతను తన చతురతతో పటేల్ పరిష్కరించారు. తొలి నుంచి విభజించి పాలించు విధానాన్ని అవలంభించిన ఆంగ్లేయులు మత ప్రాతిపదికన అఖండ భారతావనిని రెండు ముక్కలుగా చేశారు. అలాగే వెళ్తూ వెళ్తూ దేశంలోని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని ఇవ్వగా… దీని ప్రకారం తమకు నచ్చితే సంస్థానాధీశులు భారత్ యూనియన్‌లో విలీనం కావచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. మీరు భారత్‌లో లేదా… పాకిస్థాన్‌లో విలీనం కావచ్చు… లేదంటే మీరు సొంతంగా రాజ్యాలు ఏలుకోవచ్చు’ అనే స్వేచ్ఛను ఇచ్చారు. దీనితో సంస్థానాధీశులకు ఎక్కడలేని శక్తివచ్చింది. ఎవరికివారు జెండా ఎగరేయడం మొదలుపెట్టారు. అన్నింటికీ మించి హైదరాబాద్‌, జూనాగఢ్‌, కాశ్మీర్‌ లాంటి కీలక సంస్థానాలపై పాకిస్థాన్‌ కన్నేసింది. ఒకవేళ అవి పాక్‌లో కలిసిపోతే నిత్యం అశాంతి, అస్థిరత, ఘర్షణే. ఒకే ఇల్లులా ఉండాల్సిన దేశంలో ఇన్ని వేరు కుంపట్ల మంటలు భరించడం కష్టమని బావించిన పటేల్ పిల్ల రాజ్యాలన్నింటి తల్లి భారతి ఒడిలో చేర్చాలి. దేశమంతా ఒక్కటిగా ఉండాలి. ఇందుకు ఉక్కు సంకల్పం కావాలి. అలా సంస్థానాలను దేశంలో విలీనం చేసే బాధ్యతను ‘ఉక్కు మనిషి’ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్వీకరించారు. దీనికోసం ప్రత్యేకంగా ‘కేంద్రాల -రాష్ట్రాల శాఖ’ ఏర్పాటైంది. ఈ సమస్యను తనదైన శైలిలో పరిష్కరించి ఇండియన్ బిస్మార్క్‌గా వల్లభాయ్ పటేల్ ప్రశంసలు అందుకున్నారు. జర్మని ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర ఎలాంటిదో… భారత యూనియన్‌లో స్వదేశీ సంస్థానాల వీలినంలో పటేల్ ఉక్కు సంకల్పం అలాంటిది.

1947లో స్వాతంత్ర్యo వచ్చేనాటికి దేశంలో 565 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. వీటిలో కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ మినహా మిగిలినవి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో బేషరుతుగా ఇండియన్ యూనియన్‌లో అంతర్భాగమయ్యాయి. మిగతా మూడు సంస్థానాలను భారత్ యూనియన్‌లో విలీనం చేయడానికి పటేల్ పట్టుదలతో వ్యవహరించారు.

హైదరాబాద్ ను విలీనంచేసిన విధానం:

కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ లలో ముఖ్యమైనది హైదరాబాద్ సంస్థానం. ఇందులోని 80 శాతం ప్రజలు హిందువులు కాగా… మిగతా 20 శాతం ముస్లింలు మరియు ఇతర మతాలకు చెందినవారు. ప్రపంచంలో అత్యంత ధనికుడిగా పేరుపొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తమ సంస్థానానికి సొంత కరెన్సీ, రైల్వే, సైనిక వ్యవస్థలు ఉండటంతో హైదరాబాద్‌ స్వంతంత్ర రాజ్యంగా ఉండాలని దృఢ నిశ్చయంతో ఉండేవాడు.

అందువలన స్వాతంత్ర్యం ఆనంతరం మరికొంతకాలం వేచి చూసిన తర్వాత ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేస్తానని ఏడో నిజామ్ ప్రతిపాదించాడు. కానీ నిజాం వైఖరిని విశ్వసించని పటేల్ అందుకు అంగీకరించలేదు. ఎప్పట్నుండో వేచి చూస్తున్న నిజాం సంస్థానంలోని రజాకార్లు ఇదే సమయంలో మతకల్లోలాన్ని సృష్టించి ఆ ప్రాంతంలోని ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. నిజాం సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడానికి ఇదే సరైన సమయంగా పటేల్ భావించారు. ‘ఆపరేషన్ పోలో’ ద్వారా సైనిక చర్యను చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే 1947 సెప్టెంబరు 13న ప్రారంభమైన ‘ఆపరేషన్ పోలో’ మూడు రోజులు పాటు కొనసాగి అదే నెల 17న ముగిసింది.

సైనికచర్యను ప్రధాని నెహ్రూ వ్యతిరేకించినా ఆయన ఆదేశాలను పట్టించుకోకుండా హైదరాబాద్ ప్రజలకు కిసాన్ వీరుడు విముక్తి కలిగించారు. నెహ్రూ యూరప్ పర్యటనలో ఉన్నప్పుడు ఇదే సైనిక చర్యకు సరైన సమయంగా భావించిన పటేల్ ఇండియన్ ఆర్మీకి ఆదేశాలు జారీచేశారు.

కాశ్మీర్‌ను విలీనంచేసిన విధానం:

కాశ్మీర్‌ విలీన చరిత్రకు ఒక ప్రత్యేకత. ఈ సంస్థానాధీశుడు రాజా హరిసింగ్ భారత్ యూనియన్‌లో కాశ్మీర్‌ను విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే దాయాది పాకిస్థాన్ కాశ్మీర్‌లోని వేర్పాటువాదులను ప్రోత్సహించి విలీనాన్ని వ్యతిరేకించేలా చేసింది. దీనిపై కూడా సైనిక చర్య ద్వారా శాశ్వత పరిష్కారం చేయాలని పటేల్ భావించినా నాటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ దీనికి ఒప్పుకోలేదు. అప్పుడే పుట్టుకొచ్చింది ఆర్టికల్ 370, 35ఎ. దాదాపు 75 ఏళ్లుగా రావణకష్టానికి ఆజ్యం పోసింది. తాజాగా, మోదీ ప్రభుత్వం దీనిపై సాహసోపేత నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేసి పూర్తిగా భారత్‌లో విలీనం చేసింది. అయితే, ఇక్కడితో సమస్య పరిష్కారం కాలేదు. దశాబ్దాలుగా కొనసాగుతోన్న వివాదం పరిష్కారమై కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణం ఏర్పడాలంటే మరికొన్నేళ్లు వేచిచూడాల్సిoదే.

ఐక్యతా ప్రతిమ:

సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమైక్యతకు పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో నిర్మిoచిన ఒక స్మారక కట్టడం పేరు ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’. దీనిని తెలుగులో ‘ఐక్యతా ప్రతిమ’ లేక ‘ఐక్యతా విగ్రహం’ గా పేర్కొంటారు. ఈ విగ్రహాన్ని గుజరాత్‌లో నర్మదానది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మించారు.

గుజరాత్‌లో జన్మించిన సర్దార్ పటేల్ ఖ్యాతిని అంతర్జాతీయంగా చిరస్థాయిగా నిలపాలని నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంకల్పించి శ్రీకారం చుట్టారు. గుజరాత్‌లో 182 నియోజకవర్గాలున్న నేపథ్యంలో పటేల్ విగ్రహం ఎత్తు 182 మీటర్లు ఉండేట్లుగా నిర్మిoచారు. ఈ విగ్రహం ఎత్తు 597 అడుగుల ఎత్తు ఉండేలా దీనిని నిర్మిoచారు. 19వేల చదరపు కిలోమీటర్ల వ్యాసార్ధంలో 2989 కోట్ల భారీ ఖర్చుతో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం నిర్మాణం అక్టోబర్ 2014లో ప్రారంభించి అక్టోబర్ 2018 లో అనగా 4 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేశారు. ఈ భారీ విగ్రహాన్ని నిర్ణీత గడువులోపు తయారీ పనులు ముగించేందుకు 2500 మందికి పైగా కార్మికులు పనిచేశారు. అమెరికాలోని ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ విగ్రహానికి రెండింతలు పెద్దదిగా నిర్మిoచిన ‘సర్ధార్ పటేల్ ఐక్యత స్మారక చిహ్నం’ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా చరిత్ర పుటల్లో నిలుస్తుందనడానికి ఏమాత్రం సందేహంలేదు.