అమెరికాలో బిర్లా కుటుంబానికి చేదు అనుభవం

ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లాకు అమెరికాలో ఊహించని అనుభవం ఎదురైంది. కాలిఫోర్నియాలోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేయడం కోసం గంటలకొద్ది ఎదురుచూసేలే చేశారని, ఇది ముమ్మాటికీ జాతి వివక్షే అని బిర్లా కుమర్తె అనన్య బిర్లా ట్విట్టర్‌లో తెలిపారు. అనన్య బిర్లా గాయనిగా, ఆర్టిస్టుగా తనకంటూ గుర్తింపు సాధించుకుంటున్నారు.

”కాలిఫోర్నియాలోని స్కోపా రెస్టారెంట్‌ నిర్వాహకులు నన్ను, నా కుటుంబాన్ని బయటకు గెంటేశారు. జాతి వివక్ష ప్రదర్శించారు. ఇది నిజంగా విషాదకరం. వినియోగదారుల పట్ల ఇలాంటి వైఖరి సరైంది కాదు. రెస్టారెంటులో భోజనం చేయడానికి మూడు గంటలు ఎదురుచూశాం. వెయిటర్‌ జోషువా సిల్వర్‌మాన్‌ మా అమ్మతో దురుసుగా ప్రవర్తించారు. జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇది అస్సలు సరైంది కాదు. వెరీ రేసిస్ట్‌” అని తమకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. శనివారం అనన్య బిర్లా తల్లి నీరజా బిర్లా, ఇతర కుటుంబసభ్యులతో కలిసి కాలిఫోర్నియాలోని ప్రముఖ ఇటాలియన్‌- అమెరికన్‌ రెస్టారెంటుకు వెళ్లారు. ఈ క్రమంలో భోజనం ఆర్డర్‌ చేసిన తర్వాత గంటల కొద్దీ వెయిట్‌ చేయించారని, కస్టమర్లన్న కనీస మర్యాద లేకుండా అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెఫ్‌ ఆంటోనియా లొఫాసో నేతృత్వంలోని ఇటాలియన్‌ మూలాలున్న ఈ రెస్టారెంటు నిర్వాహకుల తీరును నెటిజన్ల దృష్టికి తీసుకువచ్చారు.

కూతురు ట్వీట్‌పై స్పందించిన నీరజా బిర్లా కూడా.. ”ఇది నిజంగా షాకింగ్‌గా ఉంది. అత్యంత అనుచితంగా ప్రవర్తించారు. కస్టమర్లతో ఇలా వ్యవహరించడానికి మీకు ఎలాంటి హక్కు లేదు” అంటూ రెస్టారెంట్లు నిర్వాహకుల తీరును ఎండగట్టారు. గతంలో తమకు ఇలాంటి జాతివివక్ష అనుభవాలు ఎదురుకాలేదని, ఈ విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని అనన్య సోదరుడు, క్రికెటర్‌ ఆర్యమన్‌ బిర్లా చెప్పారు.