51 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మానవ మొదటి అడుగు

నీల్ ఆర్మ్ స్ట్రాంగ్.. అపోలో 11 వ్యోమనౌక ద్వారా చంద్రుడిపై అడుగుపెట్టి అంతరిక్ష పరిశోధనలో తన మొదటి అడుగుతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేసి సరిగ్గా నేటికి 51 ఏళ్ళు. 1969 జూలై 20వ తేదీన అపోలో 11 వ్యోమనౌకకు చెందిన ఈగల్ మాడ్యూల్ ట్రాన్‌క్విలిటీ బేస్‌పైన దిగింది. కొన్ని గంటల తర్వాత.. అంటే 21.56 సీటీ (సెంట్రల్ టైమ్) (భారత కాలమానం ప్రకారం జూలై 21 ఉదయం 9.26 గంటలకు) నీల్ ఆర్మ్‌ స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టి, మానవ చరిత్రలో చంద్రుడిపై నడిచిన మొట్ట మొదటి మనిషిగా చరిత్రలో నిలిచిపోయారు.

 చంద్రుడి మీద అడుగుపెట్టిన క్షణంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఈవిధంగా పేర్కొన్నారు. ‘ఇక్కడ మనిషి వేస్తున్నది చిన్న అడుగే కావొచ్చు. కానీ, మనవాళికి ఇది అతిపెద్ద ముందడుగు’

ఆర్మ్ స్ట్రాంగ్‌ను ఎడ్విన్ బజ్, అల్డ్రిన్‌లు అనుసరించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నాసాకు చెందిన మరో ఐదుగురు భూమి సహజ ఉపగ్రహానికి వెళ్లి వచ్చారు. అయితే, 1972లో యుజెన్ సెర్నన్ చంద్రుడిపైకి వెళ్లివచ్చాక అక్కడికి మనుషులను పంపే మిషన్‌కు అమెరికా ముగింపు పలకడంతో ఆ కార్యక్రమం ఆగిపాయింది.

అప్పటి నుంచి నేటి వరకు అంటే 46 ఏళ్ల వరకు చంద్రుడి మీదకు ఏ ఒక్క దేశం మనుషులను పంపించలేదు.

చంద్రుడి మీదకు మనుషులు అసలు వెళ్లనే లేదని, అక్కడికి వెళ్లివచ్చారనే ఫొటోలు కూడా అమెరికా సృష్టించినవేనని అనేక కుట్రసిద్దాంతాలు ప్రచారంలో ఉన్నాయి.

ఈ ఏడాది మేలో నాసా చేసిన ఒక ప్రకటనలో 2024లో చంద్రుని పైకి మానవసహిత యాత్ర చేపడుతామని తెలిపింది.

ఈ యాత్రలో మహిళలను కూడా చంద్రుడి పైకి పంపిస్తామని ఈ ప్రకటనలో పేర్కొంది. అయితే, 50 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ అమెరికాతో పాటే ఏ దేశం కూడా చంద్రుడిపైకి ఎందుకు మానవులను పంపించలేదనే ప్రశ్న ఇప్పటికి సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.