సీఎం పర్యటన హడావిడేనా, క్షేత్రస్థాయి సమస్యలపై విన్నవిస్తారా?

పెడన, ఈనెల 23వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పెడన నియోజకవర్గానికి వస్తున్న విషయం తెలిసిందే. వారం రోజు నుండి మంత్రి జోగి రమేష్, అధికారులు వరుస సమీక్షలతో హడావిడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి పెడన నియోజకవర్గం రావటం స్వాగతించదగ్గ విషయం. ముఖ్యమంత్రి కార్యక్రమాల వివరాల్లోకి వెళితే నేతన్న నేస్తం పథకాన్ని బటన్ నొక్కి లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తారని నాకున్న సమాచారం. అయితే పెడన నియోజకవర్గంలో ఎక్కువమంది చేనేత కార్మికులు ఉన్నారు. వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువమంది ఆధారపడి జీవిస్తున్న రంగం చేనేత పరిశ్రమ. పెడనపట్టణం, మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాంగ, పద్మశాలి, కర్ణభక్తుల సోదరులు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. చేనేత రంగంలో మాస్టర్ వీవర్స్ మరియు ఎగుమతి దిగుమతి వ్యాపారులు తప్ప ఈ వృత్తిని నమ్ముకున్న మిగతా వారందరూ నిరుపేదలే. రెక్కాడితే గాని డొక్కాడని సగటి జీవులు. చేనేత పరిశ్రమ ప్రధాన జిల్లాల్లో కృష్ణా జిల్లా ఒకటి. జిల్లాలో దాదాపు 12వేల కుటుంబాలు చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. సహకార, ప్రైవేటు రంగంలో చేనేత వస్త్రాల ఉత్పత్తి జరుగుతోంది. ఏడాదికి దాదాపు రూ.50 కోట్ల వరకు టర్నోవర్‌తో ఈ పరిశ్రమ నడుస్తోంది. ఇక్కడ ప్రధానంగా కాటన్‌ చీరల ఉత్పత్తి జిల్లాలో జరుగుతోంది. చేనేత పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం 11 రకాల ఉత్పత్తులకు రిజర్వేషన్‌ కల్పించింది. ఆ చట్టం ఎక్కడా అమలు కావటంలేదు. పవర్‌లూమ్‌ రంగంలో చేనేత రకం వస్త్రాలను తయారు చేయటంతో మార్కెట్‌లో అసలైన చేనేత వస్త్రాలకు డిమాండ్‌ తగ్గింది. చేనేతతో పోల్చితే పవర్‌లూం తక్కువ ధరలకు మార్కెట్‌లో అందుబాటులోకి రావటంతో చేనేతకు మార్కెటింగ్‌ తగ్గిపోయింది. చేనేత పరిశ్రమను ఆదుకోవాలన్న సంకల్పం ప్రభుత్వాల్లో కన్పించటంలేదు. సహకార సొసైటీలకు చెల్లించాల్సిన నూలు రాయితీ, పావలావడ్డీ, త్రిఫ్ట్‌ఫండ్‌, రిబేటులను పూర్తిగా నిలిపివేశారు. జిల్లాలో రెండేళ్లుగా రూ.20 కోట్లను చేనేత సొసైటీలకు చెల్లించాల్సి ఉంది. కార్మికుల పొదుపునకు సంబంధించిన త్రిఫ్ట్‌ఫండ్‌, ఆరోగ్యబీమా పథకాలు కూడా నిలిచిపోవటంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నేతన్న నేస్తం పథకం కింద జిల్లాలో ఈ ఏడాది 4,292 మందికి రూ.24వేల వంతున లబ్ధిచేకూర్చారు. గతేడాదితో పోల్చితే లబ్ధిదారుల సంఖ్య 20 శాతం తగ్గింది. చేనేత మగ్గం కలిగిన కార్మికుడితో పాటు ఉపవృత్తులు, షెడ్డు కార్మికులకు కూడా ఆర్థిక సహాయం అందించాలని కార్మికులు ఎప్పటినుండో డిమాండ్‌ చేస్తున్నారు. చేనేతకు సంబంధించి కామన్‌ ఫెసిలిటీ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి నూతన డిజైన్లలో శిక్షణనివ్వాలి. ఇందుకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందించాల్సి ఉంటుంది. ఆప్కోను పటిష్ఠం చేసి సహకార సొసైటీల్లోని వస్త్ర నిల్వల్ని కొనుగోలు చేయాలి. యువత ఈ పరిశ్రమ వైపు వచ్చేలా ప్రభుత్వపరంగా చేయూతనివ్వాల్సి ఉంటుంది. జిల్లాలో టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మించి చేనేత కార్మికులు సొంతంగా ఉత్పత్తి చేసుకొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చేనేత పరిశ్రమకు ఆయువుపట్టువైన సొసైటీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. సొసైటీల దగ్గర వస్త్ర నిలువలు పెరిగిపోవడంతో చేనేత కార్మికులకు సొసైటీలు పని కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి రావలసిన రిబేట్లు, ప్రోత్సాహాలు రాకపోవడం వల్ల సొసైటీలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి.

  • చేనేత కార్మికుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇస్తారా?
    చేనేత కార్మికుడు కాసిన పద్మనాభ కుటుంబం మొత్తం ఆర్థిక బాధలతో ఆత్మహత్య చేసుకున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో ఊటుకూరు సుబ్బారాయుడు, భార్య ఊటుకూరు పైడమ్మ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. పెడన నియోజకవర్గంలో జరిగిన చేనేత కార్మికుల ఆత్మహత్యలు గురించి ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి, వారి కుటుంబానికి ఆర్థిక సహాయం ఇప్పించవలసిందిగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇలాంటి ఆత్మహత్యలు మున్ముందు జరగకుండా చేనేత పరిస్థితిని ఆర్థికంగా బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి గారికి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి.
  • హస్తకళలోనె అపురూపమైన కళ కలంకారి

పెడన కలంకారి వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వపరంగా సరైన విధివిధానాలు లేకపోవటం వల్ల కలంకారీ పరిశ్రమ కూడా సంక్షోభంలో ఉంది. కలంకారీ పరిశ్రమ సమస్యలపై ముఖ్యమంత్రివర్యులుకి తెలియజేస్తున్నారా? ముఖ్యమంత్రి బటన్ నొక్కి తప్పట్లు కొట్టినంత మాత్రాన చేనేత కార్మికుల సమస్యలు తీరవు. జోగి రమేష్ స్థానిక శాసనసభ్యులు మరియు జిల్లా మంత్రి చేనేత కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారికి వివరించగలిగే మీరు కార్మికులకు ఎంతో సహాయం చేసిన వారవుతారు. ఒకవేళ చేనేత కార్మికుల సమస్యలు డైరెక్ట్ గా మీరు ముఖ్యమంత్రికి చెప్పడానికి మొహమాట పడితే కనీసం చేనేత కార్మికులకు లేదా మాలాంటి వ్యక్తులకు అవకాశం కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.