ప్రధానిని ఆకట్టుకున్న చిన్నారి ఎస్తేర్ హన్మేట్ పాడిన వందేమాతర గేయం

మిజోరంకు చెందిన నాలుగేళ్ల చిన్నారి బాలిక ఎస్తేర్ హన్మేట్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఎస్తేర్ హన్మేట్ పాడిన వందేమాతర గేయం ప్రధాని నరేంద్ర మోదీని విపరీతంగా ఆకట్టుకుంది. ఎస్తేర్‌ హమ్నాటే పాడిన గేయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జొరమ్‌తంగాతోపాటు లక్షల మంది హృదయాలను గెలుచుకుంది. దీనిని అక్టోబర్‌ 25న ఎస్తేర్‌కు చెందిన యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేశారు. ‘ప్రియమైన సోదరీసోదరులారా.. మనం భారతీయులమై జన్మించినందుకు గర్వపడాలి. ఇది ప్రేమ, ఆప్యాయత కలగలిసిన నేల. ఎన్నో భాషలు, సంస్కృతులు, జీవనశైలులతో ముడిపడిఉన్న దేశం. మాతృభూమికి ఉత్తమ సంతానంగా నిలిచేందుకు కలిసి నడుద్దాం’ అని వీడియో డిస్క్రిప్షన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోని లక్షల మంది వీక్షించారు.

మిజోరం ముఖ్యమంత్రి ఆ వీడియోను ప్రధాని నరేంద్ర మోదీకి షేర్‌ చేశారు. కాగా మోదీ ఆ వీడియోను రీట్వీట్‌ చేస్తూ బాలికను ప్రశంసించారు. ఎస్తేర్‌ హమ్నాటేని చూస్తే గర్వంగా ఉందన్నారు. అదే సమయంలో స్వరకర్త ఎ.ఆర్.రెహమాన్ ఎస్తేర్ హనామ్టేను ప్రశంసించారు, ఈ అందమైన బేబీ గర్ల్ నటన అద్భుతంగా ఉందని అన్నారు. ఆర్మీ మాజీ చీఫ్ వేద్ మాలిక్ కూడా ఈ అమ్మాయిని  ప్రశంసించి, ఇది గొప్ప ప్రజెంటేషన్ అని అన్నారు.