దసపల్లా భూములకు రెక్కలు

  • 3 వేల కోట్ల భూముల కబ్జాకు స్కెచ్
  • 22ఏ నుంచి తీసి వ్యాపార విస్తరణకు సిద్దమవుతున్న రాబందులు

విశాఖపట్నం, నగరంలోని దసపల్లా భూములకు రెక్కలొచ్చాయి. సుమారు 3 వేల కోట్ల రూపాయలు ఆ భూముల్లో వ్యాపార విస్తరణకు భూ రాబందులు సిద్ధమవుతున్నాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. ప్రభుత్వ అతిధిగృహం దారి సర్వే నంబర్లు 1196, 1197, 1027, 1028 లలో సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన దసపల్లా భూములను వ్యాపార కార్యకలాపాలకు వినియోగించే అవకాశం లేకుండా 22ఏ లోనే ప్రభుత్వ భూమిగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం స్పందన కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ… నగరంలోని దసపల్లా లే అవుట్ సర్వే నంబర్లు 1196, 1197, 1027, 1028లలో 60 ఎకరాల భూములు ఉన్నాయని, వీటిలో 40 ఎకరాలు జీవీఎంసీ, వుడా, తూర్పు నావికాదళం సేకరించాయి, 5 ఎకరాలు ప్రభుత్వం వివిధ అవసరాలకు వినియోగించింది. మిగతా 15 ఎకరాల భూమి కొన్నేళ్లుగా వివాదాల్లో ఉన్నాయన్నారు. 2001లో సర్వే శాఖ దసపల్లా భూములను 22ఏ లో చేరుస్తూ జీవో 657 జారీ చేసిందన్నారు. సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన ఈ దసపల్లా భూములను కాజేయడానికి ప్రయివేట్ వ్యక్తులు కొన్నేళ్లుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అధికార పార్టీ పెద్దల అండతో ఈ భూములకు ఇప్పటికే పెండింగ్ రిజిస్ట్రేషన్ జరిగిపోయిందని చెప్పారు. గతంలో అక్రమంగా ఈ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్న 60 మంది నుంచి ఇందుకోసం ఎష్యూర్ ఎస్టేట్స్ డెవలపర్స్ ఎల్ ఎల్ పీ పేరిట రాత్రికి రాత్రి కంపెనీని ఏర్పాటు చేసి డెవలప్మెంట్ ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నారన్నారు. 16 ఎకరాల విస్తీర్ణంలో 76 వేల గజాల్లో 15 అంతస్థుల భవన సముదాయాలను నిర్మించేందుకు, ఇందుకు అవసరమైతే టీడీఆర్ లు తీసుకొనేందుకు ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రకటనలో భాగంగా విశాఖను పరిపాలన రాజధానిగా 2019 డిసెంబర్ 19న ప్రకటించగా ఇది జరిగిన 17 రోజుల వ్యవధిలోనే ఈ కంపెనీ ఏర్పాటు చేసి హాడావుడిగా ఒప్పందం చేసుకోవడం ఇన్ సైడ్ ట్రేడింగే కిందకు వస్తుందన్నారు. ఈ భూములు నిషేధిత 22 ఏ జాబితాలో ఉన్నప్పటికీ గత ఏడాది విశాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్లు జరగడం వాటిని తిరస్కరించడం జరిగిందని గుర్తు చేశారు. తాజాగా కొందరు ప్రభుత్వ పెద్దలతో ముడుపుల ఒప్పందాలు కుదరడంతో తిరస్కరించిన రిజిస్ట్రేషన్ లను ఆమోదించి, నిషేధిత 22 ఏళ్ల నుంచి వీటిని తొలగించేందుకు రంగం సిద్ధమవుతోందని తెలిసిందన్నారు. కారుచౌకగా కొట్టేసిన ఈ భూములలో భారీ భవనాలు నిర్మించి పది వేల కోట్ల రూపాయల వ్యాపారం చేయడానికి రంగం సిద్ధమవుతోందని ఆరోపణలు వస్తున్నాయన్నారు. యూ ఎల్ సీ పరిధిలోని ఈ భూములను తప్పడు పత్రాలతో, ప్రభుత్వ ఉత్తర్వులతో సంబంధం లేకుండా కేవలం ఎక్స్ పార్టీ కోర్టు తీర్పుల ద్వారానే కొందరు అనుమతులు పొందారన్నారు. వాటిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు , ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తూ కబ్జాదారులకు సహకరించడం దారుణమన్నారు. దసపల్లా భూములు 22ఏ నుంచి తొలిగించకుండా సుమారు రూ.2వేల కోట్ల భూముల కుంభకోణం నిలువరించి ఈ భూములను ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి, జనసేన రీజనల్ కో ఆర్డినేటర్ నాగలక్ష్మి, నాయకులు శివప్రసాద్ రెడ్డి, కళ పాల్గొన్నారు.