జోబైడెన్‌కు ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ల అభినందనలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు, ఉపాధ్యక్షరాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలా హారిస్‌కు ప్రపంచ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా  భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ జో బైడెన్‌కు, కమలా హారిస్‌కు అభినందనలు తెలిపారు. ఆధ్యంతం ఉత్కంఠగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ 284 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించగా, ట్రంప్‌ 214 దగ్గరే ఆగిపోయారు. దీంతో 77 ఏళ్ల జో బైడెన్‌ అమెరికా అధ్యక్ష పదవీ కల సాకరమైంది. ఆయన మద్దతుదారులు అమెరికా వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.

అమెరికా 46వ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టున్న జో బైడెన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ” మీరు అద్భుతమైన విజయం సాధించినందుకు అభినందనలు. ఇండియా-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడానికి మీ సహకారం క్లిష్లమైనది, అమూల్యమైనది. ఇరు దేశాల సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను” అని మోదీ పేర్కొన్నారు.

మరోవైపు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న భారత సంతతి వ్యక్తి కమలా హారీస్‌ విజయంపై ప్రధాని మరో ట్వీట్‌ చేశారు. ” మీ విజయం మార్గదర్శకం. భారతీయ-అమెరికన్లందరికీ గర్వకారణం. మీ సహకారంతో భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలంగా ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను” అని పేర్కొన్నారు.