మoత్రి వర్గ విస్తరణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పండుగ వాతావరణం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పండుగ వాతావరణం… రాజ్యసభకు ఎన్నికైన నలుగురు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రమాణ స్వీకారంతో పాటూ కీలకమైన మంత్రివర్గ విస్తరణ ఒకేరోజు కావడంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ సభ్యులు మాజీ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి మరియు పరిమళ్ నత్వానీ రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నలుగురూ ప్రమాణ స్వీకారంతో పాటు దేశవ్యాప్తంగా రాజ్యసభకు ఎన్నికైన 51 మంది నూతన సభ్యులు  ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ హౌస్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు వారితో ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేయిoచారు.

ఈ కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే రాజ్‌భవన్‌లో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లోకి కొత్త మంత్రులు చేరారు.

విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఈ మధ్యాహ్నం 1:29 నిమిషాలకు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరిగినది. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన ఆ స్థానాలను వైఎస్ జగన్ భర్తీ చేశారు. శ్రీకాకళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం శాసనసభ్యుడు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోగా… వారితో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌  రాజ్‌భవన్‌లో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు.