కేదార్ నాథ్ లో చిక్కుకున్న ఇద్దరు ముఖ్యమంత్రులు

కేదార్ నాథ్ ఆలయం పరిసరాల్లో భారీగా కురుస్తున్న హిమపాతంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిక్కుకుపోయారు. హిమాలయాల్లో  భారీగా హిమపాతం  ప్రారంభమైంది. శీతాకాలం ప్రారంభ సమయంలో హిమపాతం ఎక్కువ కావడంతో కేదార్ నాథ్ ఆలయాన్ని సైతం మూసివేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి కేదార్ నాథ్ కు చేరుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లు కేదార్ నాథ్ లో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని స్వయంగా ఉత్తరాఖండ్ డీజీ అశోక్ కుమార్ వెల్లడించారు.

స్నో ఫాల్ అధికంగా ఉన్న కారణంగా హెలీకాప్టర్ సర్వీసులు నిలిచిపోయాయని..దాంతో ఇద్దరు ముఖ్యమంత్రులు కేదార్ నాథ్ లోనే ఉండిపోవల్సి వచ్చిందని డీజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. హిమపాతం కారణంగా ఇవాళ ఉదయం 8 గంటల 30 నిమిషాలకు కేదార్‌నాథ్ ఆలయాన్ని మూసివేశారు. భాయ్ దూజ్ కార్యక్రమం తర్వాత ఆలయ ద్వారాలను మూసివేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు దేవస్థానం బోర్డు అధికారులు, పూజారులు కూడా ఆలయంలో ప్రార్ధనలు చేసేందుకు, కేదార్ పురిలో జరుగుతున్న నిర్మాణ పనుల్ని పర్యవేక్షించేందుకు ఇక్కడికి చేరుకుని..చిక్కుకుపోయారు.