ఎన్నికల కోసం టీఆర్ఎస్‌లో కొత్త కమిటీ

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా మళ్లీ మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న అధికార టీఆర్ఎస్.. ఆ దిశగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఒకటి, రెండు రోజుల్లో 100కు పైగా అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే టీఆర్ఎస్ అధినాయకత్వం పలుసార్లు సర్వేలు చేయించిందని.. వాటి ఆధారంగానే గెలిచే వారికి టికెట్లు ఇవ్వనున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొహమాటానికి పోయి గెలిచే అవకాశం లేనివారికి టికెట్లు ఇవ్వకూడదని ఆ పార్టీ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

ఇక ఎన్నికల ప్రచారం నుండి ఎన్నికల వరకు పార్టీ తరపున అన్ని గ్రేటర్‌లో అన్ని అంశాలను పరిశీలించేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్‌లోని అనేక డివిజన్లకు సంబంధించిన బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు అప్పగించాలని భావించిన టీఆర్ఎస్ నాయకత్వం.. ఎప్పటికప్పుడు ఆయా డివిజన్లలో పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందనే అంశంతో పాటు ఇతర విషయాలపై నేతలతో సమన్వయం చేసేందుకే ఈ కమిటీ ఉపయోగపడుతుందని భావిస్తోంది. గ్రేటర్ ఎన్నికలను ప్రత్యర్థి పార్టీలు, మరీ ముఖ్యంగా బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం… దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటమి ఎదురుకావడం వంటి అంశాలు  టీఆర్ఎస్ మరింత ఎక్కువగా ఎన్నికలపై దృష్టి పెట్టేలా చేశాయి. అభ్యర్థుల ఎంపిక అనంతరం గ్రేటర్‌లో నేతల ప్రచారం, అభ్యర్థుల ప్రచారం సహా అన్ని అంశాలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. పది మందితో ఏర్పాటు కాబోయే కమిటీ. ఎప్పటికప్పుడు పరిస్థితులపై కేటీఆర్‌కు సూచనలు చేయడంతో పాటు పార్టీ అధినేత కేసీఆర్‌కు పరిస్థితిని వివరించనున్నట్టు తెలుస్తోంది.