బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కే లేదు

వరద బాధితులకు సహాయాన్ని బలవంతంగా అడ్డుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నగరవాసులను ఓటు అడిగే హక్కు లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ముషీరాబాద్‌ పరిధి గాంధీనగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠా పద్మా నరేశ్‌ నేడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. నామినేషన్‌ దాఖలకు ముందు స్థానిక లక్ష్మి గణపతి ఆలయంలో పూజలు నిర్వహించారు. నామినేషన్‌ దాఖలు అనంతరం చేపట్టిన ఎన్నికల ప్రచారంలో కవిత పాల్గొని మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు గాంధీనగర్‌ డివిజన్‌తో ప్రారంభమౌతుందన్నారు.

పేద ప్రజలకు ప్రభుత్వ సాయాన్ని అడ్డుకున్న జాతీయ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. వరద బాధితుల కష్టాలకు చలించిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి సహాయం అందిస్తుంటే మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం చేసే సహాయాన్ని సైతం అడ్డుకుందన్నారు. వరద బాధిత కుటుంబాలను కేంద్రం ఆర్థికసాయం ఎందుకు అందించలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ప్రశ్నించాల్సిందిగా ప్రజలను ఆమె కోరారు. కొవిడ్‌-19 సంక్షోభంలో సైతం రాష్ర్టానికి ఏ విధమైన సాయం ప్రకటించలేదన్నారు.

వరదలు కానీ, కొవిడ్‌ సంక్షోభం కానీ ప్రజలను ఆదుకునేందుకు, రక్షించేందుకు, వారికి సేవ చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుందని అన్నారు. సీఎం నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గడిచిన ఆరేళ్లలో రూ. 67 వేల కోట్ల వ్యయంతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. ఈసారి ఎన్నికలను కూడా టీఆర్‌ఎస్‌ పార్టీయే గెలుస్తుందన్నారు.