భద్రతా దళాలకు ధన్యవాదాలు: ప్రధాని మోడీ

జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు జమ్ము కాశ్మీర్‌లో భారీ దాడికి పన్నిన కుట్రను వమ్ము చేయడంలో భద్రతాదళాలు సఫలమయ్యాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దీంతో పెను వినాశనం తప్పిందని ఆయన అన్నారు. జమ్ము శివార్లలోని నగ్రోటా బాన్‌ టోల్‌ప్లాజా సమీపంలో గురువారం ఉగ్రవాదులను తీసుకెళ్తున్న ట్రక్కును అడ్డుకోవడంతో ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్యభీకర పోరు జరగ్గా, ఈ పోరులో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నల్గురూ జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. దీనిపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోపాటు పలువురు ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జమ్ము కాశ్మీర్‌లో కింది స్థాయి నుంచి చేపడుతున్న ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బ తీసేందుకు ముంబయి తరహా దాడులకు ఉగ్రవాదులు పథకం వేశారని మోడీ చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌, ఇతర నిఘా విభాగానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జమ్ము కాశ్మీర్‌లోని నగరోటా టోల్‌ప్లాజా వద్ద గురువారం ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నల్గురు ఉగ్రవాదాలు చనిపోయారు. ఇది జైషే మహ్మద్‌ ఉగ్రవాదుల పనేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదుల నుంచి 11 ఎకె రైఫిళ్లు, 3 పిస్టళ్లు, 29 గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముంబై దాడి కంటే భారీ కుట్రను అమలు చేసేందుకు సరిహద్దు దాటి భారత్‌లోకి ఈ ఉగ్రవాదులు చొరబడ్డారని, వారి ప్లాన్‌ను భద్రతా బలగాలు వమ్ము చేశాయని జమ్ము ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఐజిపి) ముఖేష్‌ సింగ్‌ పేర్కొన్నారు.