పేదల కన్నీటిలో వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోతుంది

  • జగనన్న కాలనీల పేరుతో వేలకోట్లు దోచుకున్న వైసీపీ నేతలు
  • తొండలు గుడ్లు కూడా పెట్టని ప్రదేశాల్లో పేదలకు ఇళ్ళు
  • పేదల కన్నీళ్లు రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు
  • వైసీపీ అవినీతి ప్రపంచానికి తెలియచేసేందుకే జగనన్న మోసం పేరుతో జనసేన సోషల్ ఆడిట్
  • అహం వదిలి టిడ్కో ఇళ్లను యుద్ధప్రాతిపదికన లబ్ధిదారులకు అందచేయాలి.
  • జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, నగర అధ్యక్షుడు నెరేళ్ల సురేష్.

గుంటూరు, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి రాష్ట్రం రావణకాష్టంలా మారిందని, పేద, సామాన్య మధ్యతరగతి ప్రజలు బ్రతికేందుకు అవకాశం లేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని, నిరుపేదల కన్నీటిలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయబాబు అన్నారు. శుక్రవారం జనసేన పార్టీ నగర కార్యాలయంలో నగర అధ్యక్షుడు నెరేళ్ల సురేష్ తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు అధికారం ఇచ్చింది దోచుకునేందుకే అన్నట్లుగా ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నాయకుల వరకు రాష్ట్రాన్ని సర్వం స్వాహా చేస్తున్నారని విమర్శించారు. భూకబ్జాలు, దందాలు, అక్రమ మైనింగ్, నకిలీ మద్యం, గంజాయి లాంటి మాదకద్రవ్యాల సరఫరాతో దోచుకుంటున్నదే కాకుండా ఇప్పుడు పేదల ఇళ్ల పేరుతో వేల కోట్ల దోపిడీకి తెరతీసారని వడ్రాణం మార్కండేయ బాబు ధ్వజమెత్తారు. నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ నగరానికి దూరంగా ఎక్కడో పదిహేను కిలోమీటర్ల దూరంలో తొండలు గుడ్లు కూడా పెట్టని ప్రదేశాల్లో పేదలకు జగనన్న కాలనీలు పేరుతో ఇళ్ళు కట్టిస్తామంటూ వైసీపీ నేతలు పేదల్ని వంచిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఎకరం పది లక్షలు కూడా చేయని స్థలాలను 60, 70 లక్షల పెట్టి ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా వైసీపీ నేతలు దోచుకున్నారని విమర్శించారు. వైసీపీ నేతల దోపిడీని ప్రపంచానికి తెలియచేసేందుకే జనసేన పార్టీ జగనన్న మోసం, జగనన్న కాలనీలు పేదల కన్నీళ్లు పేరుతో 12, 13, 14 తేదీల్లో సోషల్ ఆడిట్ చేస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి వైసీపీ నేతల అవినీతిని ప్రజల ముందు ఉంచుతామన్నారు. దళితులు, ముస్లిం మైనారిటీలు, బీసీలు మా జగన్ మా జగన్ అని గుండెల్లో పెట్టుకొని పూజించి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్ప్పచెప్పినందుకు ఇప్పుడు తమకు వారసత్వంగా వచ్చే సంక్షేమ పథకాలన్నీ తీసేసి వారి గుండెలపై అదే జగన్ తంతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ గత ప్రభుత్వం కట్టిన టిడ్కో ఇళ్లను కూడా ఇవ్వకుండా మూడన్నరేళ్లుగా లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం నరకం చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అహం వదిలి ప్రజల ఇబ్బందులను కష్టాలను దృష్టిలో పెట్టుకొని యుద్ధప్రాతిపదికన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందచేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు చెప్పే మాయమాటల్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరని, వైసీపీ నేతల దాష్టీకాలకు అడ్డుకట్ట వేయాలంటే కేవలం అది పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో మాత్రమే సాధ్యమని నగర ఉపాధ్యక్షుడు చింతా రాజు అన్నారు. రాష్ట్రానికి మంచిరోజులు రావాలన్నా, ముందు తరాలకు బంగారంలాంటి భవిష్యత్ ఉండాలన్న ప్రజలు పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుణ్ణి ముఖ్యమంత్రిని చేయాలని చింతా రాజు అన్నారు. విలేకరుల సమావేశంలో నగర ప్రధాన కార్యదర్శి యడ్ల నాగమల్లేశ్వరరావు, బుడంపాడు రాజు, నగర కార్యదర్శి బందెల నవీన్ బాబు, పులిగడ్డ గోపి తదితరులు పాల్గొన్నారు.