నూతన విద్యా విధానంపై ప్రధానికి లేఖ.. రిజర్వేషన్ల ప్రస్తావన లేదు..

నూతన విద్యా విధానం 2020లో రిజర్వేషన్లు కల్పించలేదని.. ఈ విషయమై సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రధానికి లేఖ రాస్తూ.. పలు ప్రశ్నల్ని సంధించారు. నూతన విద్యా విధానం 2020లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సహా ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదని నరేంద్రమోదీని సీతారాం ఏచూరి ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం దేశంలో విద్యా విధానాన్ని ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం 2020ని తీసుకువచ్చింది. దీనిపై ప్రతిపక్షాలు సహా అనేక సంఘాలు, మేధావులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సమగ్రంగా లేదని, లోపభూయిష్టంగా ఉందని కఠిన విమర్శలు చేస్తున్నారు. అంతే కాకుండా విద్యను కార్పొరేటీకరించేందుకు ఇది ఉపకరిస్తుందని తప్పు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో సీపీఎం నేత సీతారం ఏచూరి, తాను రాసిన లేఖలో పలు ప్రశ్నల్ని లేవనెత్తారు. ”నూతన విద్యా విధానం 2020లో రిజర్వేషన్ల ప్రస్తావన లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సహా ఇతర వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాంగం కొన్ని హక్కుల్ని కల్పించింది. అందులో రిజర్వేషన్లు ఒకటి. కానీ నూతన విద్యా విధానంలో ఆ ప్రస్తావనే లేదు. విద్య పరంగా, ఉద్యోగ పరంగా, సామాజికంగా ఆయా వర్గాలు చాలా వెనుకబడి ఉన్నాయి. సరిగ్గా చెప్పాలంటే వారు వేసిన నాలుగు ముందడుగులకు ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్లు ఎంతగానో ఉపకరించాయి. అలాంటి రిజర్వేషన్లను ఇప్పుడు ప్రస్తావించకపోవడం హేయం. దీనిపై ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి” అని మోదీకి రాసిన లేఖలో సీతారాం ఏచూరి పేర్కొన్నారు.