బైడెన్‌కు అధికార బదలాయింపుకు అంగీకరించిన ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. ఆ దేశ 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. అధికారి బదలాయింపు ప్రక్రియలో సహకరించనున్నట్లు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాజాగా ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి విజయం సాధించారు. కానీ ఆ విక్టరీని ట్రంప్ అంగీకరించలేదు. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌కు అధికార బదలాయింపు కోసం జరగాల్సిన ప్రక్రియను ఫెడరల్ ఏజెన్సీ చూసుకుంటుందని ట్రంప్ అన్నారు. కానీ ఎన్నికల్లో ఓటమి అంశంపై మాత్రం కోర్టులో పోరాటం ఆపేది లేదన్నారు. తాజా ఎన్నికల్లో బైడెన్ గెలిచినట్లు గుర్తించామని జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్‌(జీఎస్ఏ) పేర్కొన్నది. మిచిగన్ రాష్ట్రంలో బైడెన్ గెలిచినట్లు సంకేతాలు అందగానే.. ట్రంప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మిచిగన్ రాష్ట్రంలో ట్రంప్ ఓడిపోవడం ఆయన పెద్ద ఎదురుదెబ్బ. అయితే అధికార బదలాయింపు ప్రక్రియ ప్రారంభం కావడం పట్ల బైడెన్ బృందం వెల్కమ్ చెప్పింది. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు.

అధికార బదలాయింపు ప్రక్రియ చేపట్టే జీఎస్ఏ బైడెన్ బృందంతో టచ్‌లో ఉన్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. అడ్మినిస్ట్రేటర్ ఎమిలీ మర్ఫీ ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. బైడెన్ అధికార బదలాయింపు కోసం 6.3 మిలియన్ల డాలర్ల ఫండ్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. దేశ ప్రయోజనాల కోసం.. ప్రాథమికంగా అధికార బదలాయింపు కోసం కావాల్సిన పనులన్నీ చేపట్టాలని ఎమిలీని ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. తమ బృందానికి కూడా ఈ విషయాన్ని చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే చట్ట ప్రకారమే తాను చర్యలు తీసుకుంటున్నట్లు ఎమిలీ తెలిపారు. అధికార బలాయింపు ప్రక్రియను ఆలస్యం చేస్తున్నట్లు ఎమిలీపై ఆరోపణలు వచ్చాయి.