నివర్‌ ధాటికి 13 జిల్లాల్లో రేపు సెలవు..

‘నివర్’ ప్రభావంతో తమిళనాడులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అతి తీవ్రమైన ‘నివర్’ తుఫాన్‌ ధాటికి తమిళనాడు వణికిపోతోంది. గురువారం రాత్రి తుఫాన్‌ తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా చెన్నై, వెల్లూర్, కడలూర్, నాగపట్టనమ్, తిరువారూర్, చెంగల్‌పేట్, కాంచీపురం జిల్లాల్లో సీఎం పళనిస్వామి సెలవు ప్రకటించారు.

తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 37 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళాల డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో 25 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించారు. తమిళనాడు నుంచి వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. రేపు తమిళనాడు, పుదుచ్చేరిలో జరగాల్సిన జాతీయ అర్హత పరీక్ష ( మాథమెటికల్‌ సైన్స్‌- కెమికల్‌ సైన్స్‌) పరీక్షలను వాయిదా వేసినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది.