తొలి వన్డేలో ఆసీస్ విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలోవిజయం ఆసీస్ సొంతమైంది. 375 పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరి వరకు పోరాడి 50 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కొండంత టార్గెట్ ఛేదించాల్సి ఉన్నా.. 101 పరుగలకే భారత్ 4 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(22), కెప్టెన్ విరాట్ కోహ్లీ(21), శ్రేయాశ్ అయ్యర్(2), కేఎల్ రాహుల్ (12)లు వెంటవెంటనే అవుట్ కావడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో శిఖర్ ధవన్(74), హార్దిక్ పాండ్యా(90) వీరోచితంగా పోరాడారు. ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే జాంపా బౌలింగ్‌లో అనవసర షాట్‌కు యత్నించి ధవన్ స్టార్క్‌కు చిక్కాడు. దీంతో వీరిద్దరి భారీ భాగస్వామ్యానికి తెరపడింది.

ఇక కొద్దిసేపటికే జాంపా బౌలింగ్‌లోనే హార్దిక్ కూడా లాంగాన్‌లో స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ ఓటమి దాదాపు ఖరారైంది. తరువాత వచ్చిన జడేజా(25) కూడా రాణించలేకపోయాడు. ఒకేఒక్క సిక్స్ కొట్టి జాంపా బౌలింగ్‌లోనే స్టార్క్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక బౌలర్లు నవదీప్ సైనీ(29 నాటౌట్), మహమ్మద్ షమి(13) కొద్దిగా బ్యాట్ ఝుళిపించినా అప్పటికే ఓటమి ఖరారైపోయింది. చివర్లో సైనీ, బూమ్రాలు క్రీజులో ఉన్నారు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో విజయం ఆసీస్ సొంతమైంది.