100 మంది చిన్నారుల వైద్య చికిత్సకు సచిన్‌ సాయం

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. క్లిష్టమైన వ్యాధులతో బాధపడుతున్న పిల్లల వైద్యానికి అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చాడు. ఇ-కామ్‌ ఫౌండేషన్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, అసోం, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో వంద మంది పిల్లలకు మాస్టర్‌ సాయం అందించనున్నాడు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ట్రస్ట్‌ దవాఖానల్లో పిల్లల చికిత్స అయ్యే ఖర్చు తన ఫౌండేషన్‌ ద్వారా సచిన్‌ సమకూర్చబోతున్నాడు. ”చిన్నారులకు వైద్య సహాయం అందించడం కోసం తెందుల్కర్‌తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నదే మా లక్ష్యం” అని ఇ-కామ్‌ ఫౌండేషన్‌ పేర్కొంది.

ప్రస్తుతం యునిసెఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఈ భారత మాజీ కెప్టెన్‌..వైద్య సహాయం విషయంలో పెద్ద మనసు చాటుకుంటున్నాడు. అసోం..కరీమ్‌ గంజ్‌ ప్రాంతంలోని మకుంద్‌ దవాఖానకు కావాల్సిన వైద్య సమాగ్రిని అందించేందుకు సచిన్‌ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.